ఏపీలో బీజేపీ నాయకులు ప్రజో పోరు యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతున్నారు. సీఎం జగన్ సహా.. వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సత్యకుమార్, జీవీఎల్ వంటివారు.. దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక, రాష్ట్ర బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సంగతి మామూలే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌పై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏదో వారు .. విమర్శలు చేయాలని చేస్తున్నారా? లేక.. నిజంగానే చిత్తశుద్ధి ఉందా? అనేది ప్రజలకు వస్తున్న సందేహం.
తాజాగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.లక్షల కోట్లు దోచుకుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ‘ప్రజాపోరు బాట’ కార్యక్రమంలో భాగంగా కాకినాడలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రానికి కేంద్రం పీడీఎస్ బియ్యం ఇస్తుంటే వైసీపీ నేతలు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ప్రశ్నిస్తుంటే తాను అబద్ధాలు చెబుతున్నానని ఎదురుదాడి చేస్తున్నారని, బాబాయ్‌ది గొడ్డలి పోటన్నది వాస్తవం కాదా అని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు జైల్లో ఉంటారని హెచ్చరించారు.
ఓకే.. సత్య కుమార్ సత్యసంధతనను తప్పుపట్టాల్సిన అవసరం లేదని అనుకుందాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు పెద్దలు ఏంచేస్తున్నారు. ఒక రాష్ట్రంలో అందునా.. ఏపీ వంటి.. అప్పులు చేసుకుని.. దినదినగండంగా ముందుకు సాగుతున్న రాష్ట్రంలో అధికార పార్టీ లక్షల కోట్లు దోచేస్తున్నప్పుడు.. ఆ మాత్రం జోక్యం చేసుకునే తీరిక లేదని అనుకోవాలా? లేక.. సత్య కుమార్ చెబుతు న్నవి వాస్తవాలు కాదని అనుకోవాలా? అనేది ప్రశ్న.
సత్య చెబుతున్నవి నిజమే అయితే.. ప్రభుత్వంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నది ప్రశ్న. మరోవైపు.. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తుంటే.. ఈ మూడేళ్లలో సీబీఐ కానీ, ఈడీ కానీ.. ఎందుకుజోక్యం చేసుకోలేదు. మరోవైపు.. బాబాయి గొడ్డలి పోటు.. అని చెబుతున్న సత్య.. ఆమెకుమార్తె.. సునీతా రెడ్డి చేస్తున్న న్యాయపోరాటానికి ఏ విధంగా బీజేపీ సాయం చేస్తోందో .. కూడా చెప్పాలి కదా.. లేకపోతే.. ఇదంతా రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.