వైసీపీ ప్లీనరీకి సంబంధించిన తగాదాలు అప్పుడే ముగిసిపోయేలా లేవు. ఉన్నట్టుండి బీజేపీ నాయకులు సీన్లోకి వచ్చి మరీ జగన్ పై ఫైర్ అవుతున్నారు. వైసీపీ ప్రవర్తించిన తీరుపైనే మండిపడుతున్నారు.
ముఖ్యంగా మీడియాను కొడాలి నాని లాంటి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా చాలా తక్కువ చేసి బండ బూతులు తిట్టడం అస్సలు బాలేదని బీజేపీ అంటోంది. కాస్త హుందాతనం పాటించాల్సి ఉందని క్లాసు పీకారు.
అప్పుడెప్పుడో వైఎస్సార్ ఆ రెండు పత్రికలనూ టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఇప్పుడు జగన్ మాత్రం ఆ రెండు పత్రికలకు మరో ఇద్దరిని కలిపి తిట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ స్వయంగా ఓ మీడియా సంస్థను పదేళ్లకు పైగా నడుపుతూ (నష్టాలను భరిస్తూ) ఈ విధంగా రామోజీతో సహా ఇతరులనూ తిట్టడం ఏం బాలేదని బీజేపీ జాతీయ స్థాయి నాయకులు, యూపీ సీఎం యోగీ ఎన్నికల వ్యూహకర్త సత్య కుమార్ అభిప్రాయపడుతున్నారు.
స్వయంగా ఓ మీడియా సంస్థను నడిపే పెద్దలు ఈ విధంగా మాట్లాడించడం ఏం బాలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి అన్నది జగన్ డిక్షనరీలోనే లేదని తేల్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు.
వాస్తవానికి ప్లీనరీ సందర్భంగా ప్రజలకు ఏం చేస్తామో చెబుతారని అంతా భావించారు కానీ ఆ విధంగా లేకపోవడంతో వైసీపీపై బీజేపీ కూడా మాటల దాడికి దిగింది. బీజేపీకి, వైసీపీకి ఎటువంటి ఒప్పందాలూ లేవని తేల్చేశారు సత్య కుమార్.
బీజేపీని అవహేళన చేసే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అని ఇదెంత మాత్రం తగదని అంటున్నారు. ఢిల్లీలో తమ తోక పార్టీగా వ్యవహరిస్తూ ఇక్కడ మరోలా మాట్లాడుతున్న వైసీపీ నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.