తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు, తిరుపతిలో కాషాయజెండా ఎగరేయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక, తిరుపతి ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కృత నిశ్చయంతో ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మతంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురుమూర్తి తిరుమల వెంకన్నను ఒక్కసారి కూడా దర్శించుకోలేదంటూ విపక్ష నేతలు ఆరోపించగా….గురుమూర్తి వెంకన్నను దర్శించుకున్నారంటూ వైసీపీ ఫొటోలు విడుదల చేసింది. ఈ వివాదం సద్దుమణగక ముందే…గురుమూర్తిపై బీజేపీ నేత సునీల్ దేవధర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదని, కాబట్టి గురుమూర్తి అభ్యర్థిత్వం చెల్లదని దేవధర్ అన్నారు. అంతేకాదు, ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. నామినేషన్ వేసేముందు గురుమూర్తి ఓ పాస్టర్ ఆశీర్వాదం తీసుకున్నారని ఆరోపించారు.
అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోలను గురుమూర్తి సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆ తర్వాత డిలీట్ చేశారని ఆరోపించారు. గురుమూర్తి మతం మారిన విషయంలో సీఎం జగన్ నోరెందుకు మెదపడం లేదని దేవధర్ ప్రశ్నించారు. గోవిందనామాలు పెట్టుకున్న తనను మంత్రి పేర్ని నాని అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు శ్రీవారి నామాలు డ్రామాలాగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.