బెంగుళూరులో కన్నడ చిత్ర నిర్మాత శంకర్ గౌడకు డ్రగ్స్ కేసు వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో కొందరు టాలీవుడ్ ప్రముఖులు, తెలంగాణ వ్యాపారవేత్తలతో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయన్న వదంతులు జోరుగా వ్యాపిస్తున్నాయి. హైదరాబాద్ వ్యాపారవేత్తలు రతన్ రెడ్డి, కలహర్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారని, వారు హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణ అసెంబ్లీలో కరోనా టెస్టులకు బదులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు చేయాలని బండి సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణలో టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలున్నారని ప్రచారం జరుగుతోందని, ఆ ఎమ్మెల్యేలు ఎవనేది సీఎం కేసీఆర్ కు తెలుసని ఆరోపించారు.
అంతేకాదు, ఆ నలుగురు ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించాలని, లేకుంటే టీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కేసులో టీఆర్ఎస్ కు చెందిన కీలకమైన నేతలున్నట్లు తెలుస్తోందని, హైదరాబాద్ లో హోటల్ అడ్డగా చేసుకొని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రగ్స్ ధందా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలకు తాను గ్రీన్ ఛాలెంజ్ తరహాలో వైట్ ఛాలెంజ్ విసురుతున్నానని సంజయ్ అన్నారు.
కొకైన్..డ్రగ్స్ తీసుకోవడం లేదని టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్, ఆయన ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే డ్రగ్స్ టెస్ట్ కు బ్లడ్ ఇచ్చేందుకు రావాలని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు. మరి, బండి సంజయ్ సవాల్ కు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.