కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బాలినేని .. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరారు. రాజీనామా సమయంలో కూడా సైలెంట్ గా ఉన్న బాలినేని.. జనసేన ఆవిర్భావ సభలో మాత్రం జగన్ పై ధ్వజమెత్తారు.
వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతోనే వైసీపీలో చేరానని.. పార్టీకి అండంగా నిలబడ్డానని.. కష్టసమయంలో తోడు ఉన్న తనకు జగన్ చాలా అన్యాయం చేశాడని బాలినేని వాపోయారు. `మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తీసేశారు. అందుకు నేనేమీ బాధపడలేదు. నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడి ఆస్తిలో సగం జగన్ దోచేశాడు. చేసిన పాపాలు ఎక్కడీకి పోవు. ఇలా మాట్లాడుతున్నందుకు రేపు నాపై విమర్శలు చేయొచ్చు. అన్నింటికి నేను రెడీనే` అంటూ బాలినేని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ దయతో జగన్ సీఎం అయ్యారు. కానీ పవన్ తన స్వశక్తితో డిప్యూటీ సీఎం అయ్యారని బాలినేని కొనియాడారు. వైసీపీలో ఉన్నప్పుడే తన గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మాట్లాడారని.. అప్పుడే జనసేనలోకి వచ్చుంటే నేటి ఆ స్థాయి మరోలా ఉండేదని బాలినేని ఎమోషనల్ అయ్యారు. నాగబాబు ప్రోత్సాహంతోనే జనసేనలోకి వచ్చానని.. ఇక ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ తోనే ఉంటానని పిఠాపురం సాక్షిగా బాలినేని ప్రతిజ్ఞ చేశారు. అలాగే తనకు పదవులు వద్దు.. మీతో సినిమాను నిర్మించే అవకాశాన్ని మాత్రం ఇవ్వండి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎదుట బాలినేని శ్రీనివాస్ మనసులో కోరికను బయటపెట్టారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.