జైలర్ సినిమా ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్. దక్షిణాదిన అన్ని చోట్లా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించడం వల్ల కేరళ ప్రేక్షకులు.. కన్నడ టాప్ స్టార్లలో ఒకడైన శివరాజ్ కుమార్ నటించడం వల్ల ఆ భాష ప్రేక్షకులు సినిమాకు బాగా కనెక్టవుతున్నారు.
తెలుగు నుంచి సునీల్, నాగబాబు నటించారు కానీ.. ఇక్కడ్నుంచి ఎవరైనా పెద్ద స్టార్ నటించి ఉంటే ఆ కిక్కే వేరుగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే నిజానికి జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక టాప్ తెలుగు హీరోకు ఇందులో క్యామియో రోల్ పెట్టాలని అనుకున్నాడట. ఆ హీరో మరెవరో కాదు.. నందమూరి బాలకృష్ణ. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు నెల్సన్.
మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ లాగే.. జైలర్ మూవీలో తెలుగు నుంచి బాలకృష్ణ క్యామియో చేస్తే బాగుంటుందని నెల్సన్ ఆలోచించాడట. ఆయన కోసం ఒక పోలీస్ పాత్ర కూడా అనుకున్నాడట. కానీ ఆ పాత్రకు ఆరంభం, ముగింపు విషయంలో సరిగ్గా సీన్లు క్రియేట్ చేయలేకపోయానని.. తనకే ఒక క్లారిటీ రాకపోవడంతో బాలయ్యను అప్రోచ్ కాలేదని నెల్సన్ తెలిపాడు. ఒకవేళ తాను ఆ పాత్ర క్రియేట్ చేసి బాలయ్యను కలిస్తే చేసేవాడో లేదో తెలియదని నెల్సన్ పేర్కొన్నాడు.
నెల్సన్ తాలూకు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా బాలయ్య జైలర్లో ఒక పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేదని నందమూరి అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ సినిమాలో ఉన్న ఎలివేషన్లకు బాలయ్య కనుక ఒక పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేసి ఉంటే థియేటర్లు హోరెత్తిపోయేవేమో.