అంతా ఆశ్చర్యం.. నిన్న మొన్నటి వరకు సీబీఐ విచారణకు హాజరై.. సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఇరుక్కుని.. నిందితుడిగా కూడా ఆరోపణలు ఎదుర్కొన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఒక్కసారిగా ఏమీ తెలియనట్టు.. ముఖంలో ఎలాంటి భయం, ఆందోళన కూడా లేకుండా.. ప్రజల మధ్యకు వచ్చేసారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీంతో అందరూ నివ్వెరపోయారు.
సొంత నియోజకవర్గం కడపలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఎంపీతో పాటు వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు పాల్గొన్నారు.వాస్తవానికి నిన్నటి వరకు సీబీఐ విచారణ.. కోర్టు కేసులు అంటూ తీవ్ర ఉత్కంఠగా.. ఎప్పుడు అరెస్టు చేస్తారో కూడా తెలియని స్థితిలో గడిపిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆదివారం ప్రజల మధ్య ప్రత్యక్షం కావడం ఆసక్తిగా మారింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి..తమ మధ్యకు రావడంతో కడప ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆదివారం ఉదయం 6 గంటలకే ఆయన ప్రజల మధ్యకు వచ్చేశారు. వేంపల్లి మండలంలో ఆయన పర్యటన ప్రారంభించి.. ఆ మండలంలోని గ్రామాలను సందర్శించారు. వేంపల్లికి చెందిన అయ్యవారిపల్లి గ్రామంలో ఆయన.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటి వల్ల చేకూరే లబ్ది అందరికి అందుతుందో.. లేదో ప్రజల నుంచే తెలుసుకున్నారు.
గ్రామస్థులు తమకున్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్థానికులు అడిగిన సమస్యలను అక్కడికక్కడే రాసుకుని.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయనతో పాటు వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు ఆయన అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు.
వ్యూహం ఏంటి?
అయితే.. అనూహ్యంగా ఇంత అలజడిలోనూ.. గడపగడపకు కార్యక్రమం నిర్వహించకపోయినా.. జగన్ ఏమీ అడగరు. తను కూడా ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఈ కార్యక్రమం ఎమ్మెల్యేలకు, మంత్రులకు మాత్రమే జగన్ నిర్దేశించారు. అయినా ఎంపీ అవినాష్ ఎందుకు పాల్గొన్నారనేది ఆసక్తిగా మారింది. పరిశీలకులు ఏమంటున్నారంటే.. తాను.. చివరి వరకు ప్రజల మధ్యే ఉన్నానని.. తాను అమాయకుడినని.. తనకు ఏపాపం తెలియదని.. రేపు సీబీఐ అరెస్టు చేస్తే.. ప్రజలకు చెప్పుకునేందుకు ఒక ప్లాన్‌గా ఉపయోగపడుతుందనే ఆయన ఇలా వ్యూహం సిద్ధం చేశారని అంటున్నారు. ఒకవేళ సీబీఐ అరెస్టు చేసినా.. తనను ప్రజల మధ్య నుంచే అరెస్టు చేయాలని కోరినా కొరవచ్చని.. తద్వారా సెంటిమెంటు మరింత పండుతందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు.