2019 ఎన్నికలకు ముందు అప్పటికి టీడీపీ ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగేది. ఆ సమయంలో ఆయన తరచూ ఒక మాట చెప్పేవారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటాననేవారు. అవంతి శ్రీనివాస్ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు.. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటానంటున్నారు. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడూ చెప్తుండడంతో కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు ఆయన్ను అనుమానిస్తున్నారు. అవంతి అంత గట్టిగా చెప్తున్నారంటే ఆయన మాటలను అనుమానించాల్సిందే అంటున్నారు.
కాగా అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. దాన్ని ఆయన అప్పుడప్పుడు ఖండిస్తూ.. అప్పుడప్పుడు వినీవిననట్లు వదిలేస్తూ వచ్చారు. కానీ, గత కొద్దిరోజలుగా ఆయన పనిగట్టుకుని మరీ ఖండిస్తున్నారు. అంతేకాదు.. తన కంఠంలో ప్రాణం ఉండగా వైసీపీని వదిలివెళ్లేది లేదని చాలా గట్టిగా చెప్తున్నారు. ఈ వైఖరితోనే ఆయన్ను జనం అనుమానిస్తున్నారు. 2019 నాటి రోజులను గుర్తు తెచ్చుకుని అప్పుడూ ఇలాగే చెప్పి పార్టీ మారారంటున్నారు.
అవంతి తన రాజకీయ జీవితంలో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలనూ చూసేశారు. తొలుత ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తరువాత గంటాతో కలిసి 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. అప్పుడు ఎమ్మెల్యే సీటు ఆశించినా ఎంపీ సీటు ఇవ్వటంతో అయిష్టంగానే పోటీ చేసారు. ఎంపీగా గెలిచారు. గంటా 2014లో చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. అవంతి ఎంపీగా ఢిల్లీకి పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు గంటా రాష్ట్రంలో మంత్రిగా ఉండేవారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ పెరిగింది. కాగా 2019లోనూ ఎంపీగానే పోటీ చేయించడానికి చంద్రబాబు ఆసక్తి చూపడంతో విషయం అర్థమైన అవంతి వైసీపీలోకి జంప్ చేశారు. భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా చేరారు. కానీ, 2022లో ఆయన మంత్రి పదవి కోల్పోయారు.
అవంతి పర్యటక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కచ్చలూరు బోటు ప్రమాదంలో 51 మంది మరణించారు. ఆ ఇష్యూ అవంతికి చెడ్డపేరు తెచ్చింది. దాంతో పాటు విశాఖ కేంద్రంగా పలుమార్లు లీకయిన అవంతి ఆడియో రికార్డులు కూడా ఆయనకు చెడ్డపేరు తెచ్చాయి. వీటన్నిటి నడుమ అవంతికి ఈసారి వైసీపీ టికెట్ రావడం అనుమానమేనని ఆ పార్టీ వర్గాలలో వినిపిస్తోంది. అవంతికి మంత్రి పదవి పోయిన తరువాత విశాఖ జిల్లా నుంచి బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్లకు మంత్రి పదవులు దక్కాయి. అమర్నాథ్ అంతా తానే అయి వ్యవహరిస్తుండడంతో అవంతి ప్రయారిటీ తగ్గింది. దీంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.