సమయస్ఫూర్తి…మెడపై కత్తి వేలాడుతున్నా ప్రాణాలు కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇదే సమయస్ఫూర్తితో ఎంతోమంది ఎన్నో విజయాలను సాధించారు. అదే సమయస్ఫూర్తి లేక ఎంతోమంది విజయం ముంగిట బోర్లాపడ్డారు. ఆ విజయానికి, పరాయజయానికి మధ్య ఉన్న చిన్న గీతను స్పృశించగలిగిన వారే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనడానికి ఎంతోమంది నిజజీవిత గాధలే నిలువెత్తు తార్కాణాలు.
ఇదే కోవలోకి వస్తుంది ఆస్ట్రేలియాకు చెందిన స్లాలోమ్ కనోయిస్ట్ జెస్సికా ఫాక్స్. ఫాక్స్ సమయస్ఫూర్తే ఆమెకు టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఒక స్వర్ణం, కాంస్య పతకం వచ్చేలా చేసింది. క్రీడాకారులకు ఫార్మాలిటీగా ఇచ్చే కండోమ్‌తో ఫాక్స్ చేసిన ప్రయోగం ఆమెకు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు అందించాయంటే అతిశయోక్తి కాదు. తనకు ఇచ్చిన కండోమ్ ను ఫాక్స్…తన కయాక్ ను రిపేర్ చేయడానికి ఉపయోగించి ఔరా అనిపించింది.
ఒలింపిక్స్ గేమ్స్‌లో అథ్లెట్లకు కండోమ్‌లు ఇవ్వడం ఆనవాయితీ. క్రీడాకారులు సురక్షిత శృంగారం చేయాలన్న ఉద్దేశ్యంతో ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్‌లో కండోమ్‌లను అథ్లెట్లందరికీ ఫ్రీగా ఇస్తారు. అయితే ఫాక్స్ తనకిచ్చిన కండోమ్‌ను వేరే విధంగా ఉపయోగించింది. తన కయాక్‌కు చివరలో పడిన ఒక చిన్న రంద్రాన్ని పూడ్చడానికి కండోమ్ ను వాడిందీ ఆస్ట్రేలియన్ అథ్లెట్. ఆ రంధ్రంలో ఒక కార్బన్ మిశ్రమాన్ని పెట్టి దానిని కండోమ్‌తో కవర్ చేసింది ఫాక్స్.
ఆ తర్వాత ఇదే కయాక్ తో బరిలోకి దిగిన ఫాక్స్…ఉమెన్స్ సీ1 కానో సాలోమ్లో స్వర్ణం, కానో సాలోమ్ కె1 ఫైనల్లో కాంస్యం దక్కించుకొని చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. కయాక్ ను కండోమ్ తో రిపేర్ చేసిన వైనాన్ని ఫాక్స్ ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఏది ఏమైనా, సమయస్ఫూర్తితో ఫాక్స్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.