టాటా … ఇండియాలో ఈ బ్రాండ్ తెలియని వాడు, ఈ బ్రాండ్ వాడని వాడు లేడు.
అసలు టాటాను ఈ దేశ అభివృద్ధి నుంచి వేరు చేసి చూడలేం.
కరోనాతో పాటు అటువంటి విపత్తులు వచ్చినపుడల్లా అతిపెద్ద సాయాలు అందించే కంపెనీ.
కంపెనీలను లాభాలతో కాకుండా విలువలతో నడిపించే కంపెనీ టాటా.
అలాంటి ’’టాటా‘‘ జగన్ నిర్ణయంపై కోపంతో కోర్టు మెట్లు ఎక్కింది.
ఒప్పందాలను ఇష్టానుసారంగా ఉల్లంఘించారని జగన్ సర్కారు మీద కోర్టుకెళ్లింది.
ఇరు వాదనలు విన్న కోర్టు జగన్ కి భారీ షాక్ ఇచ్చింది. ఈ వివాదానికి కారణమైన ‘‘మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు‘‘ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. మళ్లీ తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏ) సైతం తాజాగా రూపొందించాలని స్పష్టం చేసింది.
దీనికంతటికీ కారణం ఏపీ విద్యుత్ నియంత్రణ చట్టం విచారణాధికారి హక్కుల పరిధిని పీపీఏలో తొలగించడం. ఇది తన లక్ష్యానికి ఉపయోగపడేలా జగన్ సర్కారు చేపట్టిన ఒక కార్యక్రమం. ఈ పవర్ ప్రాజెక్ట్ టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
ఒప్పందంలో వివాదం వస్తే నియంత్రణ మండలి కాకుండా ప్రభుత్వమే సమస్యను పరిష్కరించేలా టెండరు నిబంధనలు పేర్కొన్నారని… ఇది టెండర్ మార్గదర్శకాలకు విరుద్ధమని టాటా ఎనర్జీ కోర్టుకు తెలిపింది. ఇది అనేక ప్రతిష్టంభనలకు దారితీస్తుందని వివరించింది. టాటా వారి వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ సర్కారు నిర్ణయాన్ని కొట్టేసింది.