ఏపీలో కొంతకాలంగా కొత్త ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే చాలు…అది తమ పార్టీవారైనా..విపక్ష పార్టీవారైనా….దాడులకు తెగబడడం, అక్రమ కేసులతో అరెస్టు చేయించడం ఆనవాయితీగా మారింది. పవిత్రమైన అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానిస్తే…నో యాక్షన్. కానీ, కొందరి వల్ల పార్టీకి చెడ్డపేరొస్తోందని పొరపాటున టంగ్ స్లిప్ అయిన పాపానికి వైసీపీ నేత గుప్తాకు ఘోర అవమానం.
ఈ కోవలోనే జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురంలో కొందరు టీడీపీ మహిళా నేతలపై కొద్ది రోజుల క్రితం కేసు నమోదైంది. అంతేకాదు, వారి ఇళ్లలోకి వెళ్లిన పోలీసులు …సోదాలు నిర్వహించడం వివాదాస్పదమైంది. అయితే, ఆ తర్వాత ఆ నలుగురు టీడీపీ మహిళా నేతలకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మహిళలపై నమోదైన కేసుకు, వారి ఇళ్లలో సోదాలకు సంబంధమేంటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో అసలేం జరుగుతోందో చెప్పాలని నిలదీసింది. చట్టంలోని ఏ నిబంధనల ప్రకారం సోదాలు చేశారో చెప్పాలని ప్రశ్నించింది.
అంతేకాదు, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించినా…. దర్యాప్తు అధికారి నివేదిక జతచేసి అఫిడవిట్గా ఎలా సమర్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అఫిడవిట్లో ఏమైనా విషయం ఉందా? దానిని మీరు చూశారా? అని ఫకీరప్పను ప్రశ్నించింది. సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందని ఎస్పీ ఫకీరప్పను కోర్టు నిలదీసింది. దీంతో, రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తానని ఎస్పీ సమాధానమిచ్చారు. దీంతో, ఈ కేసు విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.