జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాల మాదిరిగా మిగిలిపోయారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది మంత్రులు కేవలం నామ్ కా వాస్తే ఉన్నారని, మిగతా వ్యవహారమంతా జగన్ కనుసన్నల్లోనే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇక, మరికొందరు మంత్రులైతే తమ ఇష్టారీతిన ప్రభుత్వ నిధులు ఖర్చుపెడుతున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇక, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న రీతిలో….జగన్ సచివాలయానికి రాకపోవడంతో మంత్రులు కూడా ఏదో నామకార్థం సమీక్షలు, సమావేశాలకు వచ్చి పోతుంటారు.
సచివాలయంలోని మంత్రుల పేషీలు చాలావరకు ఖాళీగా దర్శనమిస్తుంటాయని అంటున్నారు. అయితేనేం, గుర్రం గుడ్డిదైనా…దాణాకు తక్కువ లేదన్న రీతిలో కొందరు మంత్రులు తమ పేషీలను అమర శిల్పి జక్కన్న చెక్కినట్లు చెక్కుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి తన పేషీని తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు ఖర్చుచేశారట. సచివాలయ భవన నిర్వహణ విభాగం నుంచి ఆ సోకులకు డబ్బు తీసుకుంటే ఫరవా లేదు. కానీ, సచివాలయంతో ఏ మాత్రం సంబంధం లేని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నిధులను మంత్రిగారు వాడేశారట. మద్యం ఆదాయం నుంచి రూ.25 లక్షల కార్పొరేషన్ నిధులను తన పేషీ కోసం వాడడంపై విమర్శలు వస్తున్నాయి.
అదేమంటే, నా పేషీ…నా మంత్రిత్వ శాఖ…నేను వాడితే తప్పేంటి అన్న రీతిలో వ్యవహారం ఉందట. వాస్తవానికి సచివాలయంలో భవనాలకు సంబంధించి ఏ చిన్న మార్పు చేయాలన్నా ‘సచివాలయ బిల్డింగ్ నిర్వహణ’ నిధుల నుంచి బిల్లులు విడుదలవుతాయి. ఇలా, బయట వేరే శాఖల నుంచి నగదు తీసుకునే ఆనవాయితీ లేదు. కానీ, మంత్రిగారు మాత్రం సొంత పెత్తనంతో తన శాఖ డబ్బులతో పేషీలో ఇంటీరియర్ డిజైనింగ్ చేయించారట. తాజాగా మద్యం లెక్కల మదింపులో తీగ లాగితే ఈ డొంక కదిలింది. పేషీలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల ఒత్తిడితో కార్పొరేషన్ నిధులు ఇవ్వాల్సి వచ్చిందని తెలుస్తోంది.
నారాయణస్వామి పేషీ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. పేషీలో అధికారుల కంటే, తాత్కాలిక ఉద్యోగుల పెత్తనమే సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. నారాయణ స్వామి అప్పుడప్పుడు పేషీకి రావడం వల్ల ఆయనతో సంబంధం లేకుండానే ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని అంటున్నారు. అయితే, ఈ వ్యవహారంపై నారాయణ స్వామి వివరణనిచ్చారు. తన పేషీలోని మరుగుదొడ్లు, గోడలు, ఫ్లోరింగ్, సీలింగ్ బీటలు వారిపోయి అధ్వాన్నంగా ఉండడంతోనే బేవరేజెస్ కార్పొరేషన్ నిధులతో మరమ్మతులు చేయించాల్సి వచ్చిందని చెబుతున్నారు నారాయణ స్వామి. పైగా, కార్పొరేషన్ బోర్డు తీర్మానంతోనే నిధులు విడుదల అయ్యాయని అంటున్నారు.