మత విశ్వాసాల కంటే కూడా ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు.. స్థలాల్లో బుల్డోజర్ చర్యల్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్.. జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేస్తూ.. భారతదేశం సెక్యులర్ దేశమని.. మతాలతో సంబంధం లేకుండా ఆక్రమణల తొలగింపు.. బుల్డోజర్ చర్యలు అందరికి ఒక్కటేనని స్పష్టం చేసింది.
ఈ విచారణకు గుజరాత్.. ఉత్తరప్రదేశ్.. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండటమే బుల్డోజర్ చర్యను ఎదుర్కోవటానికి కారణమా? అని ధర్మాసనం అడగ్గా.. కచ్ఛితంగా కాదన్న ఆయన.. అత్యాచారం.. ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైనా సంబంధం లేదన్నారు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోమని ధర్మాసనం పేర్కొంది.
ముందే చట్టాన్ని అతిక్రమించి ఉంటేనే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అంతేకాదు.. ఒకట్రెండు ఘటనల ఆధారంగా కోర్టు ఒక అంచనాకు రావొద్దన్న సొలిసిటర్ జనరల్.. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఉదంతాల ఆధారంగా కోర్టు ఆదేశాలు జారీ చేయటంపై తాము ఆందోళన చెందుతుననట్లు పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మనది లౌకిక దేశం. మా మార్గదర్శకాలు మతం.. జాతి.. వర్గాలకు అతీతంగా ఉంటాయి.
అందరికీ వర్తిస్తాయి. ఇక.. అక్రమణల విషయానికి వస్తే మేం ఇప్పటికే చెప్పాం. రోడ్డు.. పుట్ పాత్.. రైలు పట్టాలు ఏదైనా సరే ఏ మతమైనా సరే ఎలాంటి నిర్మాణం ఉన్నా.. అవి ప్రజలకు ఆటంకంగా మారకూడదు. దర్గా.. గుడి.. గురుద్వారా ఏదైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు. అన్ని నిర్మాణాలకు మతంతో సంబంధం లేకుండా ఒక్కటే చట్టం వర్తిస్తుంది’’ అని పేర్కొన్నారు.
యూన్ రిపోర్టర్ సీనియర్ అడ్వకేట్ వ్రిందా గ్రోవర్ ఇళ్ల లభ్యతపై వాదనలు వినిపించారు. దీనికి సొలిసిటర్ జనరల్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాల్ని అంతర్జాతీయకరించాల్సిన అవసరం లేదని.. దేశ న్యాయస్థానాలకు తగినంత శక్తి ఉందన్నారు. ఈ విషయాల్లో అంతర్జాతీయ ఏజెన్సీల జోక్యం అవసరం లేదన్నారు. ఇక.. పంచాయితీలకు.. పురపాలక కార్పొరేషన్లకు విభిన్నమైన చట్టాలున్నాయని కోర్టు పేర్కొంది. వీటిని ఆన్ లైన్ పోర్టల్స్ లో ఉంచాలని పేర్కొంది.