నందమూరి లక్ష్మీపార్వతి కి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ జగన్ హయాంలో తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆంధ్రా యూనివర్సిటీ ఆమెకు `గౌరవ ఆచార్యురాలు` హోదాను కట్టబెట్టింది. అయితే తాజాగా ఆ హోదాను తొలగించారు. ఆంధ్ర యూనివర్సిటీ లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన గౌరవ ఆచార్యురాలు హోదాను ఉప సంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కిశోర్ బాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి దాకా లక్ష్మీపార్వతికి ఈ హోదాలో యూనివర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని కిశోర్ బాబు తెలియజేశారు. అలాగే తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన టైమ్ లో లక్ష్మీపార్వతికి యూనివర్శిటీ పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యత ఇచ్చారు. తాజాగా ఈ విధుల నుండి కూడా ఆమెను తప్పించినట్లు వెల్లడించారు.
లక్ష్మీ పార్వతి వద్ద మార్గదర్శకం కోసం చేసిన పరిశోధకులను తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్‌కు మార్పు చేయాలని ఆదేశించామని కిశోర్ బాబు వెల్లడించారు. కాగా, ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతో లక్ష్మీపార్వతికి విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ విభేదాల వల్ల టీడీపీని వీడాడు. వైసీపీలో చేరారు. గత ఐదేళ్లలో లక్ష్మీపార్వతి జగన్ కు అనూకూలంగా వ్యవహరించారు. సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబపై విమర్శలు కురిపించారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగన్ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వైకాపాలో కీలకంగా వ్యవహరించిన నేతలపై చర్యలు షురూ అయ్యాయి. అందులో భాగంగానే లక్ష్మీపార్వతికి తాజాగా జలక్ తగిలిందని అంటున్నారు.