గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట మంత్రులు వెళ్లేందుకు ఇష్టపడిన ఊళ్లేమయినా ఉంటే.. ఇక మరిచిపోవచ్చు. ఎందుకంటే నిరసనలు తెలిపేందుకు వాళ్లే మీ దగ్గరకు వచ్చి మరీ! గోడు చెప్పి వెళ్తారు కనుక ! ఇప్పటికే ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని చెబుతూ మీ ఎదుటే వాళ్లు తమ చెప్పులతో తామే కొట్టుకుని వెళ్లిపోతారు కనుక ! స్థానిక ఎన్నికల్లో మీరు చెప్పిన విధంగా నడుచుకోని మాత్రాన పనులు ఆపేస్తాం అంటే వాళ్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు మరియు సహించరు కనుక!
ఇదీ ఇవాళ విశాఖ మన్యంలో జరుగుతున్న నిరసనలకు ఓ రూపం. ఇదే ఉద్ధృతి రేపటి వేళ కూడా కొనసాగనుంది. ఓటేసిన పాపానికి తమను పట్టించుకోని నాయకులపై వీరంతా మండిపడుతూ తిరుగుబాటుకు సిద్ధం అవుతున్నారు. అందుకు డిప్యూటీ సీఎం మినహాయింపు కాదు అని తేల్చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అంటేనే ఓ ప్రత్యేకం. సామాన్య స్థితి నుంచి ఎదిగివచ్చిన ఆయన మాడుగుల ఎమ్మెల్యే అయ్యారు. అనూహ్య రీతిలో ఆయన మంత్రి అయ్యారు. అటుపై డిప్యూటీ సీఎం స్థాయి వరకూ ఎదిగివచ్చారు. ఒకప్పుడు సర్పంచ్ గా రాజకీయ జీవితం మొదలు పెట్టిన ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోవడం మానేశారు. దీంతో కోపం వచ్చిన గిరిజనులు ఆయనకు ఓటేసినందుకు తమ చెప్పుతో తామే కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
అయినా సరే ! ఆయన మాత్రం సొంత నియోజకవర్గం మనుషులపై ప్రేమ, కనికరం, జాలి అన్నవి చూపించరు అని ఇక్కడి గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటేసి తప్పుచేశాం అంటూ వీరంతా అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ.. తమ చెప్పుతో తామే కొట్టుకుంటూ మంత్రి తీరుకు నిరసన తెలిపారు.
మండలంలోని వాలాబు పంచాయతీకి చెందిన రామన్నపాలెం, కోడాపల్లి, పూలగరువు, కె.టి.పాలం తదితర గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడికి చేరుకుని స్థానిక సమస్యలపై గళం వినిపించారు. మంత్రి సొంత మండలం దేవరాపల్లిలో కూడా రోడ్లు లేకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకే తాము ఓటేశాం అని, కానీ స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులను ఎన్నుకోలేదని వాలాబు పంచాయతీ ప్రజలు చెప్పారు. అప్పటి నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆవేదన చెందుతున్నారు.అదేవిధంగాపోడు భూములు సాగుచేసుకుంటున్న వారికి పట్టాలివ్వకుండా పాలకపక్షమే అడ్డుకుంటుందన్నది వారి ఆరోపణ.
Comments 1