ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మేనమామ వైఎస్ జగన్ తన అక్కచెల్లెల్లకు అందించే అమ్మఒడి పథకానికి కొత్త మెలిక పెట్టారు.
ఇప్పటికే తొలి ఏడాదికి ఇప్పటికి ఎన్నో కొత్త ఆంక్షలు రాగా తాజాగా మరి కొన్ని నిబంధనలు విధించడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే, తాజాగా విధించిన నిబంధనలు తెలియగానే ఈ పథకం లబ్ధిదారులు ఇదేమీ లంకెరా బాబూ అనుకుంటూ నిట్టూరుస్తున్నారు.
విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనాలు దక్కవంటూ అధికారులు కొత్తగా నిబంధనలు ప్రకటించారు.
నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉంటేనే పథకం అందుతుంది.
ఈ మేరకు ఈ పథకానికి అర్హతలను పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కొత్త నిబంధనలు వెలువరించింది.
దాని ప్రకారం నవంబరు 8 నుంచి ఏప్రిల్ 30 మధ్య విద్యార్థి హాజరు 75 శాతం ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే అమ్మఒడి పథకం రానట్లే.
అలాగే బియ్యం కార్డు కొత్తది ఉండాలని పేర్కొన్నారు.
కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో లబ్ధిదారుల్లో ఎవరైనా కొత్త జిల్లాల పరిధిలోకి వస్తే వారి ఆధార్ కార్డులలో జిల్లా పేరును మార్చుకోవాలి.
అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను లింక్ చేసుకోవాలి. బ్యాంకు అకౌంట్లు యాక్టివేషన్లో ఉన్నాయో లేదో విద్యార్థుల తల్లిదండ్రులే చెక్ చేసుకోవాలి.
ఇవన్నీ ఎలా ఉన్నా విద్యుత్ వినియోగంతో అమ్మ ఒడి పథకానికి లింకు పెట్టడంతో లబ్ధిదారులలో చాలామంది నిరాశ చెందుతున్నారు.
పట్టణాలలో అద్దె ఇళ్లలో ఉండేవారిలో చాలామందికి కామన్ మీటర్లు ఉండడం… ఒక్కోసారి మీటర్లలో సమస్య కారణంగా అధిక బిల్లులు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు అమ్మఒడిపై ఆశలు వదులుకుంటున్నారు.