అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడిప్పుడు క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఇప్పటిదాకా క్రికెట్ అంటే అంతగా పట్టని అమెరికన్లు.. ఇప్పుడిప్పుడే జెంటిల్మన్ క్రికెట్ లో పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలోనే ఆ దేశ జట్టు కూడా వరల్డ్ క్రికెట్ లో సత్తా చాటే దిశగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఆ దేశంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీల్లో మన ‘తెలుగు తేజం కార్తీక్ గట్టెపల్లి’ సత్తా చాటుతున్నాడు. బౌలింగ్ లో తనదైన శైలి ప్రతిభ కనబరుస్తున్న కార్తీక్.. త్వరలోనే అమెరికా జాతీయ జట్టులో స్థానం దక్కించుకొనే దిశగా సాగుతున్నాడు. అమెరికాలో కౌంటి తరహాలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో కార్తీక్ తన బౌలింగ్ పదును చూపుతున్నాడు. హోస్టన్ హరికేన్ జట్టుకు ఆడుతున్న కార్తీక్.. మైనర్ లిగ్ క్రికెట్ పేరిట జరిగిన పోటీల్లో 9 గేమ్‌లలోనే 10.4 యావరేజ్ తో ఏకంగా 17 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతగా రాణించిన కార్తీక్ గత సీజన్ లో ఇర్వింగ్ ముస్తాంగ్ మ్యాచ్ లో స్థానమే దక్కలేదట. అయినా కూడా ఈ సీజన్ లో కార్తీక్ తనదైన సత్తాతో బౌలింగ్ లో టాప్ పొజిషన్ దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా క్రికెట్ లో తన జర్నీని గుర్తు చేసుకున్న కార్తీక్ గట్టెపల్లి.. గత సీజన్ లో తనకు ఎన్నడూ ఎదురు కాని అనుభవం ఎదురైందని పేర్కొన్నాడు. అయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా అవకాశం చిక్కిన ప్రతి మ్యాచ్ లోనూ ఆడుతూనే వస్తున్నానని చెప్పాడు. అయితే తాజాగా జరిగిన యూఎస్ఏ అండర్ 19 సీజన్ ఎవరికైనా మంచి గుర్తింపు తెచ్చేదే. అందుకే ఈ సీజన్ లో మరింతగా రాణించాలనుకున్నానని పేర్కొన్నాడు. ఈ సీజన్లో తాను మెరుగ్గా రాణించకపోతే.. ఇక భవిష్యత్తే ఉండదని భావించానని చెప్పాడు. అందుకే తనలోని మొత్తం శక్తిని ఉపయోగించి సత్తా చాటానని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఈ సీజన్ లో తనలోని నైపుణ్యాన్ని కార్తీక్ వెలికి తీసి సత్తా చాటాడు. ఇక ఇదే ఏడాది హోస్టన్ ఓపెన్ పేరిట జరిగిన మ్యాచ్ లో 26 పరుగులకే 4 వికెట్లు తీశాడు.
తాజాగా ముగిసిన సీపీఎల్ టోర్నీలో కెన్నార్ లూయిస్, షార్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నితీశ్ కుమార్ లాంటి బ్యాట్స్‌మెన్‌ను కార్తీక్ పెవిలియన్ చేర్చాడు. ఈ ప్రతిభతో ఈ టోర్నమెంట్ కే బెస్ట్ బౌలర్ గా కార్తీక్ అవార్డు అందుకున్నాడు. గత కొన్నేళ్లుగా తనను తాను బౌలర్ గా మలచుకునేందుకు కార్తీక్ శ్రమిస్తున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ లో మంచి ప్రావీణ్యం సాధిస్తూ సాగుతున్న కార్తీక్.. విభిన్న యాంగిళ్లలో బౌలింగ్ చేయడంలోనూ నైపుణ్యాన్ని సంపాదించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ గా తనదైన శైలి సత్తా చాటుతున్న కార్తీక్.. ఇప్పుడు అమెరికాలో లెఫ్టార్మ్ స్పిన్నర్లుగా రాణిస్తున్న నోస్తుష్ కెంజిగే, కరిమా గోరే, నిసర్గ్ పటేల్ ల తర్వాతి స్థానాల్లోనూ కొనసాగుతున్నా.. త్వరలోనే ఈ జాబితాలోనే టాప్ పొజిషన్ చేజిక్కించుకునే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా మన తెలుగు నేలకు చెందిన కార్తీక్ గట్టెపల్లి అమెరికన్ క్రికెట్ కు ఆశాకిరణంగానే పరిణమించడం అక్కడి మన ప్రవాసులను హర్షాతిరేకాల్లో ముంచెత్తుతోంది.