హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు సరోగసీ ద్వారా పండంటి కవల పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. అద్దె గర్భం ద్వారా పిల్లలను కన్న నయన్ దంపతులకు వారి అభిమానులతోపాటు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో నయన్ దంపతులనుద్దేశించి కోలీవుడ్ నటి కస్తూరి చేసిన ట్వీట్ పెను దుమారం రేపుతోంది.
సరోగసీని దేశంలో నిషేధించారంటూ కస్తూరి సోషల్ మీడియా చేసిన ట్వీట్ వైరల్ అయింది. దీంతో, ఆమెపై నయన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రతి విషయాన్ని వివాదం చేయడమే కస్తూరి పని అని, ఈ విషయం వదిలేసి ఆమె పని ఆమె చేసుకోవాలని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ట్రోలర్స్ తో పాటు కొన్ని వెబ్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లకు కస్తూరి వార్నింగ్ ఇచ్చారు.
భారతదేశంలో 2022 జనవరి నుంచి సరోగసీపై నిషేధం ఉందని, క్లిష్ట, ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప సరోగసీని అనుమతించరని కస్తూరి చెప్పారు. అర్హత గల న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు తనకుందని, తాను ఎవరినీ ఉద్దేశించి ఈ ట్వీట్ చేయలేదని కస్తూరి కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, తన ట్వీట్ కు నయన్ సరోగసీ వ్యవహారానికి లింక్ పెట్టి వార్తలు, కథనాలు ప్రసారం చేస్తున్న ఎన్టీవీ(తెలుగు న్యూస్ ఛానెల్), కొన్ని తమిళ మీడియా, సోషల్ మీడియా చానెళ్లను ఆమె హెచ్చరించారు. అలా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కస్తూరి వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు, నయన్ సరోగసీ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఆ సరోగసీ వివరాలను నయన్, విఘ్నేష్‌లు ప్రభుత్వానికి అందజేయాలని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే సరోగసీ ప్రక్రియ జరిగిందా? లేదా? అన్న విషయంపై ఆయన వివరణ కోరారు. మరి, ఈ వ్యవహారంపై నయన్ దంపతుల వివరణ ఏమిటి? కస్తూరి వ్యాఖ్యలపై వారి స్పందన ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు సరోగసిపై నయన్ దంపతులు స్పందించలేదు.