తమిళ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన కస్తూరి తమిళనాట స్థిరపడ్డ తెలుగు వారి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. కస్తూరి తాజాగా బ్రాహ్మణ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా బ్రాహ్మణుల హక్కుల గురించి మాట్లాడింది. వాళ్లు దేనికీ భయపడాల్సిన పని లేదని వ్యాఖ్యానించింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. అవసరం లేని విధంగా ఆమె తమిళనాట స్థిరపడ్డ తెలుగు వారి ప్రస్తావన తెచ్చింది.
300 ఏళ్ల కిందట తమిళనాట రాజులకు శృంగార సేవలు అందించడానికి వచ్చిన వేశ్యల కుటుంబాలన్నీ తెలుగు వారివే అని.. వాళ్లే ఇప్పుడు తమిళ నేల తమది అంటున్నారని.. అలాంటిది బ్రాహ్మణులు ఎప్పట్నుంచో తమిళనాట కీలకంగా ఉన్నారని.. వాళ్లు తమిళనాడు తమది అనడానికి సందేహించాల్సిన అవసరం లేదని.. వాళ్లు తమ హక్కుల కోసం పోరాడాలని కస్తూరి వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శతాబ్దాల నుంచి తమిళనాడులో స్థిరపడి ఆ రాష్ట్రంలో అంతర్భాగంగా మారిన తెలుగు వారి గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు దారుణమంటూ ఆమె మీద మండి పడుతున్నారు.
నటిగా కస్తూరి కెరీర్ ఎప్పుడో ముగియగా.. కొన్నేళ్ల కిందట క్యారెక్టర్ రోల్స్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఐతే ఆమె కెరీర్ తిరిగి ఊపందుకోకపోవడంతో అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాగా ఇప్పుడు ఆమెకు రాజకీయాల మీద మనసు మళ్లినట్లుందని.. అందుకే ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తోందని ఆమె తీరును దుయ్యబడుతున్నారు. ఈ కామెంట్లపై తమిళనాట స్థిరపడ్డ తెలుగు వారు ఆందోళన బాట పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాట కీలకమైన ఓటు బ్యాంకుగా మారిన తెలుగు వారి విషయంలో అక్కడి రాజకీయ పార్టీలు కూడా ఎలా స్పందిస్తాయో చూడాలి.