పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా….పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ…అన్నాడు సుమతీ శతకకర్త బద్దెన కవి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన మాధవన్ ప్రస్తుతం ఈ సుమతీ శతకం చదువుకొని మురిసిపోతూ ఉంటాడు. ఎందుకంటే, మాధవన్ కొడుకు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్ లో జాతీయ స్థాయిలో 7 పతకాలను గెలుచుకొని తన తండ్రి గర్వపడేలా చేశాడు.
తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో హీరోగా, మంచినటుడిగా పేరు తెచ్చుకున్న మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ కూడా స్విమ్మింగ్ లో తన తండ్రికి తగ్గ తనయుడనిపిస్తున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ మాధవన్ అద్భుతమైన స్విమ్మర్‌గా రాణిస్తున్నాడు. తన తండ్రితో పాటు దేశం గర్వించేలా వేదాంత స్విమ్మింగ్‌లో 7 జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు.
ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను వేదాంత్ సాధించాడు. 4 రజత పతకాలతోపాటు 3 కాంస్య పతకాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన వేదాంత…800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4 × 100 ఫ్రీస్టైల్ రిలే, 4 × 200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజతం సాధించాడు.
ఈ నేపథ్యంలోనే వేదాంతపై రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి ప్రశంసలు కురిపించారు. మాధవన్ పెంపకం గురించి తాము గర్విస్తున్నామని, వేదాంత అద్భుతమైన స్విమ్మర్ అని పొగడ్తలతో ముంచెత్తారు. గత ఏడాది మార్చిలో వేదాంత్ స్విమ్మింగ్ లో కాంస్య పతకాన్ని సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్లో వేదాంత్ పతకం సాధించాడు.