టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత ఇంటిపై అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ కనుసన్నల్లో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.
జగన్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చేశారని, ప్రజాస్వామ్యం పూర్తిగా మంటగలిసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి ముట్టడి చేసిన వైసీపీ గూండాలు రాళ్లదాడి చేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనమని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటుపడిన జగన్ రెడ్డి.. ఆంధ్రాని అఫ్ఘనిస్థాన్గా మార్చేశారని, వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారని నిప్పులు చెరిగారు.
వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రతిపక్ష నేతలు మాట్లాడటం తప్పా అని అచ్చెన్న ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై నిలదీస్తే గూండాగిరి చేయడం ఏమిటని మండిపడ్డారు. జోగి రమేష్ ఎమ్మెల్యేనా.. లేక గూండానా..అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి , జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబుగారి ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి రాళ్ల దాడి చేయడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపై రాళ్ల దాడి చేయడం అరాచక పాలనకు నిదర్శమనమన్నారు. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని ఈ తరహా దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జోగి రమేష్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని.. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, తాడేపల్లి పీఎస్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాడేపల్లి పీఎస్ లో ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, పట్టాభి వెళ్లడంతో అక్కడ వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, వైసీపీ నేతల తీరుకు నిరసనగా తాడేపల్లి పోలీస స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.