ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాదిమంది మృత్యువాత పడుతుంటారు. అతివేగం, డ్రైవింగ్ ల నిర్లక్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా..ఇలా కారణమేదైానా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే, ఈ ప్రమాదాల్లో కొన్ని మాత్రం భయానకంగా ఉంటాయి. ఆ ప్రమాదం జరిగిన తీరు మన ఊహకు అందని రీతిలో ఉంటుంది. హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ పై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ కింద రోడ్డుపై ప్రయాణిస్తున్న మరో కారుపై పడ్డ ఘటన కొద్ది సంవత్సరాల క్రితం సంచలనం రేపింది. ఆ ఘటనలో చిన్నారి రమ్య మృత్యువాత పడ్డ ఉదంతం చాలామందిని కలచివేసింది.
ఇదే తరహాలో తాజాగా తెలంగాణలో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదం వైరల్ అయింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దోస్తునగర్ లో అతి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు రోడ్డు మీద వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొనడంతో ఓ యువకుడు మృత్యువాత పడిన ఘటన కలకలం రేపుతోంది. ప్రమాద తీవ్రతకు ఆ యువకుడు ఏకంగా ఎగిరి చెట్టుకొమ్మకు చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందడం షాకింగ్ గా మారింది.
నిర్మల్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు ఉట్నూరు నుంచి కడెం వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా ఢీకొట్టింది. దీంతో, ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉట్నూరు మండలం నిలాగొండికి చెందిన సోయం మాన్కు(28) ఎగిరి చెట్టు కొమ్మకు చిక్కుకున్నారు. కారు ఢీకొట్టిన ధాటికి మాన్కుకు తీవ్ర గాయాలు కావడంతో చెట్టుకొమ్మకు వేలాడుతూనే మృతిచెందారు. అయితే, ఈ ప్రమాదానికి కారణమైన కారునడిపిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.