సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) పై జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా కక్ష సాధిస్తోందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు కూడా సమర్థించడంతో జగన్ పై ఆయన పోరాడి గెలిచినట్లయింది. ఈ నేపథ్యంలోనే మే 31వ తేదీ ఆయన సర్వీసులో చిట్టచివరి రోజు కావడం, అదే రోజు ఆయన పోస్టింగ్ స్వీకరించి…ఆ వెంటనే రిటైర్ కావడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ ప్రభుత్వం పై ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.
వివేకా హత్య కేసులో ప్రాథమిక సాక్షాలు కీలకమని, హత్య సమయంలో పూర్తి ఆధారాలు సేకరించలేదని అన్నారు. ఈ కేసు విచారణ కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి పూర్తిగా మాట్లాడకూడదని చెప్పారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి రావడానికి తనకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తన తప్పు ఉంటే క్షమాపణలు చెప్పి శిక్షకు కూడా సిద్ధమైన వాడినని, కానీ చేయని తప్పుకు శిక్ష వేయడంతోనే పోరాడాలని అనుకున్నారని చెప్పారు. ఈ పోరాటంలో తనకు లక్షలాది మంది మానసికంగా అండగా నిలిచారని, పోరాడే కొద్ది కొత్త కొత్త కేసులు పెట్టారని అన్నారు.
పాలనా వ్యవస్థలో అనేక నియమాలు ఉంటాయని, అవి పట్టించుకోకుండా విచారణ పేరుతో కాలయాపన చేశారని ఆరోపించారు. తమ డిపార్ట్మెంట్లో కొందరు అబద్ధాలు చెప్పి ఉండవచ్చని, వాళ్ళు వాస్తవం అనుకుని తన టార్గెట్ చేసి కేసులు పెట్టారని అన్నారు. నాయకుడికి నిజా నిజాలు విశ్లేషించుకునే గుణం ఉండాలని, అసలు తాను చేసిన తప్పేంటో మీ అధినేతను అడిగి చెప్పాలని ఓ వైసిపి నాయకుడితో తాను అన్నానని గుర్తు చేసుకున్నారు. ఆ అంశాన్ని తమ అధినేత దగ్గర చెప్పే ధైర్యం కూడా ఆ నాయకుడు చేయలేకపోయాడని అన్నారు.
తన శేష జీవితం ప్రశాంతంగా కొనసాగేలా చూసుకుంటానని, ప్రజలు, సమాజం కోసం స్పందిస్తానని ఏబీవీ చెప్పారు. కాగా, ఐదేళ్లపాటు జగన్ పై సుదీర్ఘ న్యాయం పోరాటం చేసి గెలిచిన ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సముచిత గౌరవం కలిగేలాగా ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది.