అమరావతిని ఆంధ్ర రాజధానిగా కేంద్రం గుర్తించడం లేదా..?
సీఎం జగన్మోహన్రెడ్డి బాటలోనే మోదీ ప్రభుత్వం కూడా నడుస్తోందా..?
ఇటీవల రాష్ట్ర అధికారులకు దాని నుంచి వస్తున్న లేఖలు, సర్క్యులర్లపై ఆంధ్రప్రదేశ్-హైదరాబాద్ అని ఉంటుండడం ఈ అనుమానాలకు ఆస్కారమిస్తోంది.
ఏదో పాత అలవాటు ప్రకారం అలా పెట్టారని కాసేపు అనుకున్నా.. జగన్కు ముందు చంద్రబాబు ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించారు కదా! రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలడం.. దానికి ప్రధాని మోదీయే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేయడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలా మంది కేంద్ర మంత్రులు, అధికారులు వచ్చి వెళ్లారు.
ఉత్తర ప్రత్యుత్తరాలూ సాగాయి. వాటిపై అమరావతి అని స్పష్టంగా పేర్కొన్నారు కదా! ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు గుర్తుకొచ్చింది. అదీగాక జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. బిల్లులను ఆమోదించుకున్నారు. గవర్నర్ కూడా సంతకం చేశారు. అయితే వాటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. విశాఖకు కార్యాలయాల తరలింపునకు బ్రేక్ వేసింది.
రాజధానులపై వ్యాజ్యాలు తేలేదాకా అక్కడకు తరలివెళ్లే అవకాశమే ఉండదు. ఈ విషయం కేంద్రానికి తెలియదా? ఈ వ్యాజ్యాల్లో అది కూడా ప్రతివాదిగా ఉంది కదా! ఒక్క రాజధానికే దిక్కులేదు.. మూడు రాజధానులు కడతారా అని బీజేపీ జాతీయ నేతలు కూడా జగన్ను ఎద్దేవాచేశారు. కానీ ఇప్పుడు ఆ మూడు రాజధానులకు కేంద్రం అంగీకరించినట్లు కేంద్ర హోంశాఖ చెప్పిన విషయాలు ధ్రువపరుస్తున్నాయి.
‘ఏపీ రాజధాని ఏది? రాష్ట్రంలో పేదల కోసం ఎన్ని ఇళ్లు కట్టారు? రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులు మంజూరుచేశారు? రాష్ట్రంలో స్మార్ట్ సిటీలకు ఎన్ని నిధులిచ్చారు? రాష్ట్రప్రభుత్వం పేర్కొన్న మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా’ అని హైదరాబాద్కు చెందిన చైతన్యకుమార్రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నలు వేశారు.
రాజధానిపై ప్రశ్న గతంలో అడిగినప్పుడు.. ‘మీరు అడిగిన విషయం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్)లో పేర్కొన్న నిర్వచనం కిందికి రాదు’ అని కేంద్రం జవాబు చెప్పింది. అంటే… ఏపీ రాజధానికి సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి సమాచారమూ లేదట! దీనిపై కోర్టుకెళ్తానని ఆయన స్పష్టం చేయడంతో కేంద్రం సమాధానాలిచ్చింది.
ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణ-అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం తీసుకొచ్చి.. మూడు రాజధానులను ఏర్పాటు చేసిందని.. రాష్ట్ర రాజధాని నగరం ఏదన్నది ఆ రాష్ట్రప్రభుత్వమే నిర్ణయిస్తుందని పేర్కొంది. ఇక్కడే కేంద్రం వైఖరిపై సందేహాలు వస్తున్నాయి. ఏపీ రాజధాని ఏదంటే.. ఇప్పుడు ఏది ఉంటే అదే చెప్పాలి.
మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు..? పోనీ మూడు రాజధానులను అంగీకరిస్తున్నట్లయినా చెప్పలేదు. అసలా సమాధానాల్లో అమరావతి అన్న పదమే లేదు. మూడు రాజధానుల్లో ఆ పేరూ ఉంది కదా! అంటే రాజధానిగా దానిని అంగీకరించనట్లే కదా! కేంద్రం వైఖరేమిటో అంతుపట్టకుండా ఉంది.
అమరావతి నిర్మాణానికి రూపాయైునా ఇవ్వలేదు!
అమరావతి నిర్మాణానికి కేంద్రం వేల కోట్లు ఇచ్చిందని.. నాటి సీఎం చంద్రబాబు దీనికి లెక్కలు చెప్పాలని బీజేపీ నేతలు నిన్నటిదాకా తెగ మాట్లాడారు. ఇదంతా అబద్ధమని.. కేంద్రం అమరావతి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తేలింది. ‘అమరావతి నిర్మాణానికి కేంద్రం ఎంత సహాయం చేసింది?’ అని చైతన్యకుమార్రెడ్డి ప్రధాని కార్యాలయాన్ని ఆర్టీఐ చట్టం కింద ప్రశ్నించారు. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది.
‘‘ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో రెండు ప్రాజెక్టుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెయ్యి కోట్లు ఇచ్చింది. వీటిని.. విజయవాడ నగరంలో వరదనీటి నిర్వహణ, గుంటూరు నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం ఇంతకు మించి ఎలాంటి నిధులూ ఇవ్వలేదు. నిధుల ప్రతిపాదనలూ మా శాఖ వద్ద పెండింగ్లో లేవు’ అని తెలిపింది.