జనసేన అధ్యక్షడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆరు నెలల ముందు వైసీపీ నాయకులు ఎంతలా విమర్శించారో, ఆయన వ్యక్తిగత జీవితంపై ఏ విధంగా దాడి చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని, ఆయన్ను అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వమని ఛాలెంజ్ చేసిన నాయకులు వైసీపీలో ఎందరో ఉన్నారు. వారందరికీ పవన్ మాటలతో కాకుండా గత ఎన్నికల్లో చేతలతో సమాధానం చెప్పారు. శాసనసభకు ఎన్నిక అవ్వడంతో పాటు మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు.
అటువంటి పవన్ పై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో పవన్ పై ఎన్నో విమర్శలు గుప్పించిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు సడెన్ గా ఆయనపై ప్రేమను కురిపించారు. `యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు దాదాపు 75 ఏళ్ల వృద్ధుడైన పెద్దమనిషి నాయకత్వం వహించలేడు. జాతీయ ప్రజాదరణ మరియు వయస్సు రిత్యా పవన్ కళ్యాణ్ గారే ఏపీకి ప్రాతినిధ్యం వహించగలరు. ఎన్డీఏ అధికార పార్టీల నాయకుల్లో పవన్ కళ్యాణ్ అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి` అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా లాక్కున్న అంశంపై నమోదైన కేసులో విజయసాయిరెడ్డిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇలాంటి తరుణంలో పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ పెట్టడంతో.. రాష్ట్ర ప్రజలు, అధికార పార్టీ నాయకులు గట్టిగా సెటైర్లు పేలుస్తున్నారు. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో ప్రజలు నిర్ణయిస్తారు అది మీ పని కాదని కొందరు అంటుంటే.. నువ్వెంత కాకాపట్టినా పోర్టు కేసులో జైలుకు వెళ్లడం ఖాయమని మరికొందరు విజయసాయి రెడ్డికి చురకలు వేస్తున్నారు.
National popularity and age on his side, I truly believe that Dy. CM @PawanKalyan garu is the most ideal person amongst the leaders of the NDA ruling parties in Andhra Pradesh to lead and represent AP. AP is a young state and cannot be led by an almost 75 year old Senile…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 6, 2024