ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలో నియోజకవర్గంలో ఆసక్తికర సీన్ చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన టీడీపీ మరియు జనసేన.. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలుగా మారాయి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఐదు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరుగునున్నాయి.
అయితే ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. పోటీ చేయాలని ఉన్నా కూడా స్థానికంగా మద్దతు లేకపోవడంతో వైకాపా నాయకులు వెనక్కి తగ్గారు. దీంతో టీడీపీ వర్సెస్ జనసేన గా పోటీ మారింది. ఇప్పటికే టీడీపీ, జనసేన తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదు డైరెక్టర్ పదవులకు మొత్తం 18 మంది నామినేషన్లు వేశారు. ఆ తర్వాత ఆరుగురు ఉపసంహరించుకోగా.. ప్రస్తుతం 12 మంది బరిలో ఉన్నారు.
వీరిలో జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తరుఫున కొంతమంది అభ్యర్థులు ఉండగా.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అండతో మరికొంత మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. గుర్తుల కేటాయింపు పూర్తైంది. అక్టోబర్ 6వ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తమ ఆధిపత్యం నిలబెట్టుకోడానికి ఇరు పార్టీ అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు. తాము సీఎం చంద్రబాబు తాలూకా అని టీడీపీ నేతలు.. మేము పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి తాలూకా అని జనసేన నేతలు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరి ఎన్నికల లోపు రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా..? లేక ఇరు వర్గాలు పోటీకి దిగుతాయా..? అన్నది చూడాలి. ఒకవేళ సయోధ్య కుదిరితే ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.