ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సోమవారం సచివాలయంలోని 5వ బ్లాక్లో తొలిసారి కలెక్టర్లతో సమావేశం అయిన చంద్రబాబు.. పలు కీలక అదేశాలు జారీ చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకుని, పేదరికం లేని సమాజం కోసం పని చేయాలని కోరారు.
అందులో భాగంగానే ప్రతినెల 10వ తేదీన `పేదల సేవలో` అనే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. జీరో పావర్టీ అనేది తమ ప్రథమ కర్తవ్యం అన్నారు. పీ4 మోడల్ ద్వారా పేదరికాన్ని నిర్మూలిద్దామన్నారు. పేదల సేవలో కార్యక్రమం ద్వారా పేదలకు మెరుగైన ఉపాధి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో రూ.2.50వేల కోట్లను ప్రజలకు పంచినా.. బటన్లను నొక్కడం తప్ప ఏనాడు ప్రజల వద్దకు వెళ్లలేదని, సభలు పెట్టినా బలవంతంగా ప్రజలను తెచ్చే పరిస్థితి ఉండేదని చంద్రబాబు ఎద్దేవ చేశారు. ఆ పరిస్థితో మార్పు రావాలని.. నిబంధనల చట్రంలో ఇరుక్కోకుండా మానవతా ధృక్పథంలో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కలెక్టర్లు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల్ని దూషించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, చులకన చేయడం వంటి చేయొద్దని.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు.