ఏపీ నూతన ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పెన్షన్ పెంపు హామీని నెరవేర్చేందుకు నడుం బిగించిన సంగతి తెలిసిందే. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంపు ఫైల్ కూడా ఒకటి. అయితే తాజాగా పెన్షన్ దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యమంటూ లేఖలో పలు కీలక విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు.
మేనిఫెస్టోలో పింఛన్ ను ఒకేసారి రూ.1000 పెంచి ఇస్తున్నామని చెప్పాము. పింఛన్ల పెంపు వల్ల నెలకు అదనంగా ప్రభుత్వంపై రూ.819 కోట్ల భారం పడుతుంది. అయినాసరే ప్రజా శ్రేయస్సు కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషకంగా ఉందన్నారు. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దకే తెచ్చి అందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
నాటి అధికార పక్షం మిమ్మల్ని ఎంత క్షోభ పెట్టిందో చూశాను. ఎన్నికల సమయంలో మూడు నెలలు మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన మీ కష్టాలు చూసి చలించిపోయాను. అందుకే ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని హామీ ఇచ్చాను.. అందుకు అనుగుణంగానే ఏప్రిల్, మే, జూన్ నెలల పెంపు రూ.3 వేలు, జులై రూ.4 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు అందించనున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును పింఛన్ల కార్యక్రమానికి తిరిగి పెట్టాము. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.