ఏపీలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ పార్టీని ఘోరంగా ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఇప్పుడు మరో కీలక ఘట్టానికి ముహూర్తం పెట్టారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈనెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీఎం అవకాశం కల్పించారు.
దీంతో ఇప్పుడు ప్రొటెం స్పీకర్ పై చర్చ మొదలైంది. అసలు ప్రొటెం స్పీకర్ అంటే ఏమిటి..? ఎందుకు ప్రొటెం స్పీకర్ ను నియమిస్తారు..? వారికి ఎలాంటి పవర్స్ ఉంటాయి..? వంటి అంశాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా ఎన్నికయిన లోక్ సభ, అసెంబ్లీలకు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ లను ఎంపిక చేయడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ఆయా సభల వ్యవహారాలను రాష్ట్రపతి, గవర్నర్లు చూసుకోవాలి. లేదా వారు తమ ప్రతినిధిని నియమించుకోవచ్చు.
లోక్ సభలో అయితే రాష్ట్రపతి ఎన్నికైన ఎంపీల్లో ఒకరిని తన ప్రతినిధినిగా నియమించుకోవాలి. రాష్ట్రాల అసెంబ్లీలో అయితే గవర్నర్ ఎమ్మెల్యేల్లో ఒకరిని తన ప్రతినిధిగా నియమిస్తారు. అయనే ప్రొటెం స్పీకర్. అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనేవి రాజ్యాంగబద్ద పదవులు.. వీరికి పవర్స్ ఉంటాయి. కానీ ప్రొటెం స్వీకర్ కు ఎటువంటి పవర్స్ ఉండవు. ఎందుకంటే, రాజ్యాంగంలో ప్రొటెం స్పీకర్ అన్న పదమే ఉండదు. ఇదొక తాత్కాలిక పదవి. ఒక్కసారి స్పీకర్ ఎంపిక జరిగితే ప్రొటెం స్పీకర్ తక్షణమే సాధారణ ఎమ్మెల్యేగా మారిపోతారు.
అలాగే ప్రొటెం స్పీకర్ గా ఎవరుండాలనే దానిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో గవర్నర్ కూడా ప్రొటెం స్పీకర్ ను ఎంపిక చేయవచ్చు. వయసు రిత్యా కాకుండా సభలో సినియారిటీని పరిగణలోకి తీసుకుని ప్రొటెం స్పీకర్ ను నియమిస్తారు. ఒకవేళ సీనియర్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి కేబినెట్లో భాగస్వామిగా లేదా ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటే అతని తరువాత సీనియర్‌గా ఉన్న ఎమ్మెల్యేను నియమిస్తారు. ఇక ఎవరినైతే ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారో వారు ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రోటెం స్పీకర్ గా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించాలి.