ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఊహించని ఫలితాలతో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. పొత్తుతో పోటీ చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కూటమి తరపున సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల కేబినెట్ పంపకాలు కూడా ముగిశాయి. జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టేశారు.
మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటూ కార్యచరణ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలపై సంతకాలు చేశారు. అలాగే అటు రాజధాని మరియు ఇటు పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇక ఇలాంటి తరుణంలో మళ్లీ ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీల ఉప ఎన్నికలకు ఎలక్షన్ కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
వైసీపీ నుంచి టీడీపీలోకి మారడంతో రామచంద్రయ్యపై మండలి చైర్మన్ ఇటీవల అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశాడు. దీంతో రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నారు. జూన్ 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జులై 2వ తేదీ తుది గడువు కాగా.. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జులై 5 వరకు అవకాశం ఉంటుంది. జులై 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ను నిర్వహించి.. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.