ఏపీ రాజధాని అమరావతి కి సంబంధించి గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడుసంచలనంగా మారాయి. అదే సమయంలో.. ఈ అంశంపై పెద్ద ఎత్తున కన్ఫ్యూజ్ అయ్యేలా పరిస్థితి ఉంది. ఇంతకూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఏమని ప్రచారం జరుగుతోంది? అసలు ఇంత గందరగోళం ఎందుకు? ఎవరి కారణంగా విషయం మరింత సంక్లిష్టంగా మారింది అన్న వివరాల్లోకి వెళ్లే ముందు.. ఈ ఇష్యూను వీలైనంత సింఫుల్ గా చేయటం ద్వారా.. విషయాన్ని మరింత సులువుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
అసలు సమస్యేంటి?
అమరావతిని రాజధానిగా చంద్రబాబుప్రభుత్వం అనుకోవటం.. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులుగా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై అమరావతి రైతులతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ‘‘ఏపీ రాజధానిని మార్చటానికి.. రాజధాని నగరాన్ని రెండు.. మూడుగా విభజిస్తూ తీర్మానం కానీ.. చట్టం కానీ చేసే శాసనాధికారం ఏపీ అసెంబ్లీకి లేదు’’ అని పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పు తర్వాతేమైంది?
ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ అధికారపక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు తీర్పులో.. రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు .. పలు డెవలప్ మెంట్ పనులు చేసేందుకు నిర్దిష్ట గడువును విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది జగన్ సర్కారు. స్టే ఇవ్వాలని కోరింది.
సుప్రీం ఏం చెప్పింది?
ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం ఇరు వర్గాల వాదనలు విని.. జగన్ ప్రభుత్వం కోరిన రీతిలో ఏపీ హైకోర్టు చెప్పిన అన్ని అంశాల మీదా స్టే ఇవ్వటం సాధ్యం కాదని చెప్పింది. అదే సమయంలో ఏపీ హైకోర్టు పేర్రకొన్న కొన్ని అంశాల్ని తప్పు అని స్పష్టం చేసింది. ఇక్కడే అసలు గందరగోళం మొదైలంది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు.. ఆదేశాల్ని చూస్తే.. ఏపీ హైకోర్టు తీర్పు మొత్తాన్ని తప్పుగా తేల్చలేదు. అదే సమయంలో.. అందులో పేర్కొన్న అంశాల్లో కొన్నింటిపైన తన అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది.
గందరగోళం మొదలు
సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. కొన్ని అంశాలు అమరావతి రైతులకు.. అమరావతిని రాజధానిగా కోరుకునే వారికి అనుకూలంగా ఉంటే.. మరికొన్ని అంశాలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో.. ఎవరి వాదన వారు వినిపించటం.. సుప్రీం చెప్పిన అంశాల్ని హైలెట్ చేయటం. తమకు అనుకూలంగా ఉన్న అంశాల గురించి ప్రచారం చేసుకోవటంతో సుప్రీంకోర్టు అసలేం చెప్పింది? అసలేం జరుగుతుంది? అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. ఈ కేసులో ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. డిసెంబరు చివరి వారం లోపు అందరూ తమ నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి (2023) 31కు వాయిదా వేసింది.
అమరావతి రైతుల తరపున వాదించింది ఎవరు?
అమరావతి రైతుల వాదనల్ని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన వారిని చూస్తే..
– సీనియర్ అడ్వకేట్లు ఫాలీ ఎస్ నారిమన్
– శ్యాం దివాస్
– ఆదినారాయణరావు
ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన వారు ఎవరంటే?
– మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్
– రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి
– అడర్వకేట్ జనరల్ శ్రీరాం
– సీనియర్ అడ్వకేట్ నఫ్డే
ఇక సుప్రీం వాదనల్ని చూస్తే.. ప్రధానంగా కొన్ని అంశాల మీద స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అందులో ప్రధానమైనది కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం లేదని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టు మీద స్పష్టత ఇవ్వాలన్నప్పుడు.. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పారు.
అమరావతి రాజధానిగా పేర్కొంటూ.. అక్కడ మౌలిక సదుపాయాలు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పును తప్పు పట్టింది. హైకోర్టు తమ హద్దులు దాటినట్లుగా మాకు అనిపిస్తోందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. హైకోర్టు కార్యానిర్వాహక వ్యవస్థలా మారకూడదని.. ఆ విషయంలో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లుగా జస్టిస్ వేణుగోపాల్ పేర్కొన్నారు. దాదాపు గంటన్నర పాటు సాగిన వాదనలో భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలతో పాటు.. వారు ఇచ్చిన 33 వేల ఎకరాల గురించి వాదనలు జరిగాయి. రోజుల్లో చేయాల్సిన పనులను కూడా చేయలేదని పేర్కొన్నారు.
ఇలా అమరావతి రాజధానికి సంబంధించిన అంశాల్లో పలు కోణాలపై తీవ్ర వాదనలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఆ విషయాన్ని వదిలేసి.. సుప్రీం చేసిన వ్యాఖ్యల్లోని సారాంశాన్ని యథాతధంగా చెప్పటం వదిలేసి.. ఎవరికి ఏది అసవరం? ఏది తమకు అనుకూలంగా ఉందన్న విషయాల్ని మాత్రమే చెప్పుకోవటంతో కన్ఫ్యూజన్ పెరిగింది. మొత్తంగా చూస్తే.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులోనికొన్ని అంశాలపై స్టే ఇవ్వగా.. మరికొన్ని అంశాలపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. దీంతో.. ఎవరికి వారు తమకు నచ్చిన అంశాల్ని మాత్రమే ప్రస్తావించటంతో గందరగోళం చోటు చేసుకుంది. మొత్తంగా చూస్తే.. అటు అమరావతి రైతులకు.. ఇటు ప్రభుత్వానికి కొన్ని సానుకూలతలు.. మరికొన్ని ప్రతికూలతల్ని ప్రస్తావించింది. అయితే.. ఎవరికి వారు వారికి అవసరమైన అంశాల్ని మాత్రమే హైలెట్ చేస్తుండటంతో కాస్తంత గందరగోళంగా మారింది. తాజా విచారణ.. రెండు పక్షాలకు కాస్తంత తీపిని.. మరికాస్త చేదును మిగిల్చాయని చెప్పాలి.