తెలంగాణలో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు వ్యవహారం ఇప్పుడు ఎవరి పీకకు చుట్టుకుంటుందన్నది ప్రశ్నగా మారింది. బెంగళూరులో జరిగిన ఒక పార్టీకి తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరైనట్లుగాసమాచారం బయటకు వచ్చింది. అయితే.. వారు ముగ్గురు కాదు.. నలుగురన్న మాట తాజాగా వినిపిస్తోంది. అయితే.. ఈ నలుగురు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నా.. అధికారికంగా మాత్రం వెల్లడి కాని పరిస్థితి.
అదే సమయంలో.. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు.. సినీ రంగానికి చెందిన వారికి కూడా లింకులు ఉన్నట్లు చెబుతున్నారు. బెంగళూరులోని ఒక ప్రముఖ నటుడికి చెందిన హోటల్ లో నిర్వహించే పార్టీల్లో డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్లుగా గుర్తిస్తున్నారు. తాజాగా ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన బెంగళూరు పోలీసులు, హోటల్ సీసీ కెమేరా ఫుటేజ్ ను సేకరించినట్లుగా తెలుస్తోంది.దీని ఆధారంగా పార్టీకి హాజరైన ప్రముఖుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇందులో కనిపించిన నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల్ని గుర్తించారని చెబుతున్నారు.
వీరికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు.. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో ఒకట్రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వటం ఖాయమని.. వారు బెంగళూరు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. డ్రగ్ పార్టీలకు హాజరయ్యే ప్రముఖుల్లోరాజకీయ.. వ్యాపార.. సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారని.. అవన్నీకూడా బెంగళూరు పోలీసుల రికార్డులకే పరిమితమైనట్లుగా తెలుస్తోంది.
ఈ కేసులో తొలుత కన్నడ సినీ నిర్మాత శంకరగౌడను అరెస్టు చేయటంతో హైదరాబాద్ లింకులు బయటకు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన కలహార్ రెడ్డి డ్రగ్ పార్టీ ఏర్పాటు చేశాడని.. బెంగళూరు నుంచి శంకరగౌడ డ్రగ్ష్ ను అందించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాల్ని సంపాదించే ప్రయత్నంలో పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి కర్ణాటక పోలీసులు నోటీసులు ఇస్తే.. నలుగురు ఎమ్మెల్యేల పేర్లు బయటకు వచ్చేస్తాయని చెబుతుున్నారు.