2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తి దాడి ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడు శ్రీనివాస్ నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది..శ్రీనివాస్ తోపాటు ఇరు పక్షాల న్యాయవాదులు హాజరయ్యారు. ఈ కేసులో తాజాగా శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిందితుడు శ్రీనివాస్ లేఖ రాయడం సంచలనం రేపింది.
తాను 1,610 రోజులుగా బెయిల్ లేకుండా జైలులోనే ఉన్నానని, తనకు విముక్తి కలిగించాలని అభ్యర్థించారు.. తనపై నమోదైన కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారణ జరిపి న్యాయం చేయాలని చాలాసార్తు విన్నవించానని, అయినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తున్నానని అన్నారు.
శ్రీను తెలుగులో రాసిన లేఖను ఇంగ్లీషులోకి అనువాదం చేసి పంపిస్తున్నామని అతడి తరఫు లాయర్ సలీం చెప్పారు. మాజీ సీజేఐ ఎన్వీ రమణకు ఇదే విషయంపై శ్రీను తల్లి సావిత్రి కూడా లేఖ రాశారని చెప్పారు. ఈ కేసులో సీఎం జగన్ 15 నిమిషాలు కేటాయిస్తే సాక్ష్యం చెప్పి వెళ్లవచ్చని, ఉద్దేశపూర్వకంగా ఆయన తన న్యాయవాదులతో పిటిషన్లు వేయించారని ఆరోపించారు. ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారని, అయినా కొత్తగా పిటిషన్ వేయడం వెనుక వేరే కారణాలున్నాయని ఆరోపించారు. విచారణను వేగవంతం చేసి.. కేసును ముగించాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.