తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరును సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇవ్వాలని మొదట నిర్ణయించింది ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ సంస్కరణలు జరిగాయని చంద్రబాబు పేరును రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు ప్రస్తావించారు. అటువంటిది, 20 ఏళ్లు కలిసి పనిచేసిన చంద్రబాబు వంటి సహచరులను బీఆర్ఎస్ నేతలు అగౌరవ పరిచారని చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ వంటి నేతలు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు.
గ్లాస్ మంచినీళ్లుిచ్చిన వారిని గుర్తు పెట్టుకునే తెలంగాణ సంస్కృతిని కూడా మరిచి దశాబ్దాలపాటు కలిసి పనిచేసిన వారిని అగౌరవపరచడం సరికాదని హితవు పలికారు. తనకు అటువంటి గుణం లేదని, అందరినీ గౌరవిస్తానని రేవంత్ అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం, ఉంటున్న ఇంటి కప్పు పడగొట్టడం బీఆర్ఎస్ కు అలవాటేనని రేవంత్ చురకలంటించారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడి ప్రతిరూపం అన్న రీతిలో చర్లపల్లి జైల్లో ఉన్నట్లు జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని, విద్యుత్ కమిషన్ ముందుకు వచ్చి కేసీఆర్ తన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. నేడు సాయంత్రం విచారణ కమిషన్ కొత్త చైర్మన్ ను అపాయింట్ చేస్తామన్నారు.