రాష్ట్ర బీజేపీలో కొత్తగా అయోమయం మొదలైనట్లే ఉంది. నిజంగానే అయోమయం మొదలైందా లేకపోతే జనాలను పిచ్చోళ్ళను చేస్తున్నారా అన్నదే అర్ధం కావటం లేదు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే అందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. హైకోర్టు ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఇక రాష్ట్రప్రభుత్వమే అని కూడా అన్నారు.
ఇదే విధమైన ప్రకటనను ప్రొద్దుటూరులో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేశారు. వీళ్ళద్దరి ప్రకటనలు చూసిన తర్వాత అందరికీ ఆశ్చర్యమేస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉంటే అని చెప్పటం ఏమిటో అర్ధంకావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం చాలా స్పష్టంగా ఉంది కదా. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు గురించి జగన్+మంత్రులు దాదాపు ఏడాదిన్నరగా పదే పదే ప్రస్తావిస్తున్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా ఇంకా బీజేపీ నేతలకు ఏమికావాలో అర్ధం కావటం లేదు. అయినా వారం రోజుల క్రితం వరకు కూడా ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని ఇదే బీజేపీ నేతలు ఒకటికి పది సార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఒకపుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలని బీజేపీ నేతలు చేసిన డిక్లరేషన్ ను కూడా కమలనాథులు మరచిపోయి జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.
అలాంటిది హఠాత్తుగా రెండు రోజులుగా హైకోర్టు ఏర్పాటు విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మాట మారుస్తున్నారో అర్ధం కావటం లేదు. ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతుంటే జనాలు తమను ఎలా నమ్ముతారనో ఆలోచన కూడా కమలనాథుల్లో ఉన్నట్లు లేదు. తప్పో ఒప్పో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి దానికే కట్టుబడుండాలి. ఒకవేళ తమ నిర్ణయాన్ని మార్చుకోదలిస్తే అదే విషయాన్ని బహిరంగంగా జనాలకు చెప్పాలి. అంతేకానీ అవసరానికి తగ్గట్లుగా స్టాండ్ మార్చుకుంటే జనాలు నమ్మరని కమలనాథులు గ్రహించాలి.
Comments 1