దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన `ఛత్రపతి`, `బాహుబలి ` చిత్రాలు ఎంత మంచి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాహుబలి చిత్రం తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. అలాగే ఈ సినిమాతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు. ప్రస్తుతం ప్రభాస్ `రాధేశ్యామ్` మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. పిరియాడికల్ లవ్‌స్టోరిగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 11న అట్టహాసంగా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఓ రేంజ్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో దర్శకధీరుడు రాజమౌళి కూడా భాగం అయ్యారు. తాజాగా ప్రభాస్, రాజమౌళి కాంబోలో చిత్ర టీమ్ ఓ ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ `రాధేశ్యామ్ సినిమాను మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు` అంటూ నేరుగానే ప్రశ్నించాడు.
అందుకు రాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చి ప్రభాస్ మనసు దోచేశారు. ఆయన ఏమన్నారంటే.. `నువ్వు నా డార్లింగ్, నీకోసం ఏదైనా చేస్తా` అని పేర్కొన్నారు. ఆ ఒక్క మాటతో ప్రభాస్ ఎంతగానో పొంగిపోయాడు. మరోవైపు అభిమానులు సైతం రాజమౌళి అన్న మాటకు ఫిదా అయిపోయారు. అంతేకాదు, ప్రభాస్-రాజమౌళిల బాండింగ్ ఎప్పుడూ ఇంతే స్ట్రాంగ్‌గా కొనసాగాలని కామెంట్లు చేస్తున్నారు.
కాగా, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో హీరోలుగా నటించారు. మార్చి 25న అంటే మరో పదిహేను రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అయినప్పటికీ రాజమౌళి రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో పాల్గొని ప్రభాస్ అంటే తనకు ఎంత ఇష్టమో స్పష్టంగా తెలియజేశారు.