రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల వైఖరిపై నెటిజన్లు మండి పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఆయనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వైసీపీ నాయకులు ఇప్పుడు మాత్రం కొనియాడుతున్నారు. కొందరు మౌనంగా ఉన్నా.. మరికొందరు మాత్రం నిమ్మగడ్డను సపోర్టు చేస్తున్నారు. ఈ పరిణామంపై అందరూ విస్తు పోతున్నారు.
స్థానిక ఎన్నికల్లో రెండో ఘట్టమైన.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందేగా. ప్రస్తుతం ఈ విషయంలో నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ, జనసేన, వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్ష పార్టీలూ వ్యతిరేకించాయి. ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి మొదలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కోర్టుకు కూడా వెళ్లాయి.
అప్పట్లో అవినీతి, అక్రమాల కారణంగా.. మా వాళ్లు నామినేషన్ వేయలేక పోయారు కనుక.. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో 16 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే.. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన ఈ 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి.
కాగా, 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు.. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది.
అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇక, తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ నేతలు హర్షించారు. అదేసమయంలో నిమ్మగడ్డకు సానుకూలంగా కామెంట్లు చేస్తున్నారు.
దీంతో విస్తుపోతున్న నెటిజన్లు.. ఇటీవలే కదా.. ఆయనను తిట్టిపోశారు.. ఇప్పుడే దేవుడు అయిపోయారా? అంటూ ట్రోల్స్ ప్రారంభించారు. ఏదేమైనా.. రాజకీయం అంటే.. ఇంతే! తమకు అనుకూలంగా ఉంటే.. ఒకలా.. వ్యతిరేకమైతే.. మరోలా ఉంటుంది!!