వైసీపీ హయాంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని, లడ్డూ తయారీలో జంతు కొవ్వును కలిపారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరోపణ చేయడం, కొన్ని ఆధారాలు మీడిమా ముందు ఉంచడంతో.. ఈ విషయం యావత్ దేశాన్ని కుదిపేసింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పండితులు, హిందూసంఘాలు లడ్డూ కల్తీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. మంగళవారం దేశ అత్యన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.
ఫస్ట్ హియరింగ్ లో న్యాయస్థానం రాష్ట ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ఓ ప్రశ్న సంధించారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా, సిట్ రిపోర్ట్ రాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి లడ్డూ కల్తీ జరిగిందని ఎలా చెప్తారు..? అన్నదే ప్రశ్న. దీన్నే ఆయుధంగా మార్చుకున్న వైసీపీ డ్రామా షురూ చేసింది. అసలు కోర్టులో ఏం జరిగిందో పూర్తి తెలుసుకోకుండానే.. భక్తులకు, కోట్లాది హిందువులకు అబద్ధపు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వానికి సుప్రీం చివాట్లు పెట్టిందని.. దేవుడిని రాజకీయాలకి దూరంగా ఉంచాలని మొట్టికాయలు వేసిందని వైసీపీ ముఖ్య నేతలు తెగ హడావుడి చేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేయాలంటూ చెత్త డిమాండ్లు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి వారు.. లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేసి లడ్డులా దొరికిపోయిన బాబు! అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. అంతటితో ఆగకుండా ఫస్ట్ హియరింగ్ కే తాము గెలిచేశాము అన్న చందంగా `సత్యమేవ జయతే` అన్న ట్యాగ్ ను వైసీపీ తెగ ట్రెండ్ చేస్తోంది.
అసలు కేసు వేసింది వైసీపీ వాళ్లు. కాబట్టి అటువైపు నుంచి లేవనెత్తిన ప్రశ్నల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదుల నుంచి న్యాయమూర్తి క్లారిటీ తీసుకునే ప్రయత్నం ప్రస్తతానికి జరిగింది. రెండో వైపు వాదనలు పూర్తిస్థాయిలో స్టార్ట్ అవ్వలేదు. అసలు సిసలైన సినిమా అక్టోబరు 3న జరగబోయే విచారణలో తేలనుంది. కానీ ఈలోపే న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విడ్డూరంగా మారింది.