ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో ఎంపికయ్యే ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని తాజాగా ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తాజాగా మీడియాకు వివరాలు అందించారు.
అదే సమయంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని తాము ఎంపిక చేయటం లేదని చెప్పటం ద్వారా.. వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి. ఉపాధ్యాయ సంఘాల నుంచి రంగంలోకి దిగే టీచర్ అభ్యర్థులకు ఉండే సత్తా.. పార్టీ అభ్యర్థులకు ఉండదు. అందుకే.. పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
మార్చి 29న నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. మరోవైపు రాజ్యసభకు ఎన్నిక కావటంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయటంతో మరోస్థానం ఖాళీ అయ్యింది. ఇటీవల పార్టీ నేత చల్లా రామక్రిష్ణారెడ్డి మరణంతో ఏర్పడిన ఖాళీ స్థానానికి ఎన్నికను నిర్వహిస్తున్నారు. దీంతో మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. తమ పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల్ని వైసీపీ ప్రకటించింది. వారెవరంటే..
1. చల్లా భగీరథరెడ్డి
2. బల్లి కల్యాణ చక్రవర్తి
3. సి. రామచంద్రయ్య
4. మహ్మద్ ఇక్బాల్
5. దువ్వాడ శ్రీనివాస్
6. కరీమున్నీసా
తండ్రి మరణం కారణంగా ఆయన స్థానంలో చల్లా కుమారుడు భగీరథ రెడ్డికి అవకాశం లభించింది. చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణం నేపథ్యంలో ఆయన కుమారుడుకు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి అవకాశం కల్పించారు. దీంతో.. ఎంపీ ఉప ఎన్నికకు వేరే అభ్యర్థిని బరిలోకి దించనున్నారు.
విజయవాడ నుంచి కార్పొరేటర్ గా వ్యవహరించే కరీమున్నీసాకు ఎమ్మెల్సీగా ప్రమోషన్ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు.. పార్టీలో సీనియర్ నేతగా ఎన్నాళ్ల నుంచో పదవి లేకుండా ఉన్న సి. రామచంద్రయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. మొత్తంగా.. తూకం తప్పకుండా అభ్యర్థుల ఎంపికలోజాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెప్పాలి.