వైఎస్సార్ ధర్మపత్నిగా తెర చాటుగా ఉండే విజయమ్మ ఆయన మరణాంతరం రాజకీయాల్లోకి బలవంతంగా రాబడ్డారు. ఆ తరువాత కొడుకు జగన్ కోసం ఆమె ఏకంగా ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ టూర్లు ఎన్నో వేశారు. వైసీపీ తరఫున అనేక బహిరంగ సభల్లో కూడా మాట్లాడారు.
ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ఆమె వైసీపీ నాయకురాలిగా కూడా వ్యవహరించారు. ఇక ఏపీలో జగన్ గెలుపుతో తన రాజకీయం ముగిసింది అనుకున్నారు. కానీ జగన్ షర్మిలల మధ్య విభేదాలు రావడంతో ఆమె పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నాడు కొడుకు కోసం రాజకీయాలు చేసిన విజయమ్మ ఇపుడు కూతురు షర్మిల కోసం రంగంలోకి దిగాల్సి వస్తోందిట.
ఆమె తాజాగా మాజీ కాంగ్రెస్ నేతలను, అన్ని పార్టీలలో ఉన్న వైఎస్సార్ అభిమాన నాయకులను ఒక చోట చేర్చేందుకు యత్నిస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా ఫ్యూచర్ లో తెలంగాణాలో షర్మిల పెట్టిన వైఎస్సార్ టీపీ కి మద్దతు సమీకరించనున్నారు అంటున్నారు.
నిజానికి షర్మిల వైఎస్సార్ జయంతి వేళ అంటే జూలై 8న పార్టీ పెట్టారు. కానీ ఇప్పటికి రెండు నెలలు అయినా కొత్త నాయకులు ఎవరూ వచ్చి చేరలేదు. మరో వైపు ఆ మాత్రం ఈ మాత్రం పేరు ఉన్న నాయకులు కూడా పార్టీని వీడిపోతున్నారు. తెలంగాణాలో అద్భుతాలు సృష్టిద్దామని అన్నను సైతం కాదని రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలకు ఇపుడు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి.
అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. రేవంత్ రెడ్డిని సరైన టైమ్ లో పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ ప్రకటించింది. దాంతో ఆయన తన సత్తా గట్టిగానే చాటుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి వస్తాయనుకున్న వలసలు ఆగిపోయాయి. అదే విధంగా ఇతర పార్టీల నుంచి కూడా నేతలు ఎవరూ తొంగి చూసే చాన్సే లేదు.
ఇక తెలంగాణా రాజకీయ క్షేత్రంలో షర్మిల పార్టీని రాజకీయనా గుర్తించే పరిస్థితి కూడా కనిపించడంలేదు. ఈ పరిస్థితులలో ఆమెను ఒడ్డెకించడానికి విజయమ్మ నడుము బిగించారు అంటున్నారు. షర్మిల పార్టీకి అవసరమైన మద్దతుని కూడగట్టడమే విజయమ్మ టార్గెట్ గా చెబుతున్నారు.
వైఎస్సార్ తో పనిచేసిన వారు, ఒకనాటి సహచరులను ఒకే చోట చేర్చి వారి సహకారాన్ని ఆమె కోరుతారు అంటున్నారు. అయితే అదంతా ఈజీ వ్యవహారం కాదనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే వారంతా ఇపుడు వేరు వేరు పార్టీలలో చేరిపోయారు. తమ రాజకీయ జీవితాన్ని వేరేగా మార్చుకున్నారు. వైఎస్సార్ సతీమణిగా విజయమ్మ మీద గౌరవం ఉంటుంది కానీ దాని కోసం తమ రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరేనే అంటున్నారు. చూడాలి మరి.