దివంగత నేత వైఎస్ వివేకా హత్యపై ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వివేకా హత్య కోసం 40 కోట్లు చేతులు మారాయని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆ హత్య కేసుకు సంబంధించి డబ్బులు చేతులు మారాయనేందుకు సాక్షాధారాలున్నాయని, అయినా ఐదేళ్లుగా నిందితులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
సీబీఐ ఆధారాలు సేకరించే దాకా ఈ కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉందన్న సంగతి తమకు తెలియదని వాపోయారు. ఆ విషయం తెలిసిన తర్వాతే హత్యకు ముందు, తర్వాత అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్ చేశారు అనే విషయాలు బట్టబయలు అయ్యాయని అన్నారు. వివేకా హత్య జరిగిన ఘటనా స్థలంలో ఆధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
కాగా, మే రెండో తేదీన బద్వేల్ లో జరిగిన బహిరంగ సభలో వివేకా హత్య గురించి షర్మిల చేసిన కామెంట్లు నేపథ్యంలో ఆమెపై తాజాగా ఎన్నికల సంఘం కేసు నమోదైంది. గతంలో, కడప కోర్టు వారించినప్పటికీ వివేకా హత్య గురించి షర్మిల మాట్లాడడంతో ఆమెపై బద్వేల్ నోడల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలోనే షర్మిలపై ఐపిసి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.