తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాజాగా సంచలన విమర్శలు గుప్పించారు. వైసిపిని బిజెపి ఉంచుకుందని, బిజెపికి వైసిపి తొత్తుగా, తోకపార్టీగా వ్యవహరిస్తుందని షాకింగ్ కామెంట్లు చేశారు. ఐదేళ్లపాటు బీజేపీకి ఊడిగం చేసిన జగన్ ఇప్పుడు కూడా స్పీకర్ ఎన్నిక సందర్భంగా బిజెపికి మద్దతు ఇచ్చారని విమర్శించారు. ఇక వైసిపిని ప్రజలు గొయ్యి తీసి పాతిపెట్టారని దుయ్యబట్టారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని షర్మిల క్లారిటీనిచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించడం చేతగాని వారు వైఎస్ వారసులు కాదని ఘాటుగా విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ నికార్సైన కాంగ్రెస్ మనిషి అని, అందుకే తాము ఆయన 75వ జయంతిని ఘనంగా నిర్వహించామని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కు ఎటువంటి సంబంధం లేదని షర్మిల స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారికి షర్మిల వార్నింగ్ ఇచ్చారు. ఇకపై వైఎస్ఆర్ విగ్రహాలను పగలగొడితే ఊరుకోమని, పగులగొట్టిన చోటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ఐదేళ్లపాటు ఏమీ చేయలేకపోయారని, అందుకే అది ప్రైవేటీకరణ వరకు వెళ్లిందని విమర్శించారు. ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, ప్రధాని మోడీతో మాట్లాడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చంద్రబాబు పరిరక్షించాలని కోరారు.
ఇక, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన రెండో రోజు నుంచి ఆ పథకం అమలవుతుందని గుర్తు చేశారు. గతంలో అమ్మ ఒడి పథకం కింద ప్రతి బిడ్డకు 15000 అని చెప్పిన జగన్ ఆ తర్వాత మాట తప్పారని, ఇప్పుడు తల్లికి వందనం పథకంలో కూడా ప్రతి బిడ్డకు 15000 అని చెప్పిన చంద్రబాబు ప్రతి తల్లికి 15000 అని మాట తప్పుతున్నారని విమర్శించారు.