2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యోదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సీబీఐ విచారణ కోరి…సీఎం కాగానే సీబీఐ విచారణ వద్దన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. బాబాయ్‌ని చంపిన వారితో కలిసిన వ్యక్తి జగన్ అని, నాడు వివేకా కూతురు… నేడు షర్మిల సొంతపార్టీ పెట్టి పోరాడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వ్యాఖ్యలకు తగ్గట్టుగానే తాజాగా జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. కడప జిల్లా పులివెందులలో నేడు జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి జగన్ హాజరు కాలేదు. వివేకాఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల,వివేకా కూతురు వైఎస్ సునీత వైఎస్ కుటుంబ సభ్యులు, తదితరలు వివేకాకు నివాళులు అర్పించారు.
వైఎస్ వివేకానందరెడ్డి ద్విదీయ వర్ధంతి కార్యక్రమానికి షర్మిల హాజరుకావడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపైనా చర్చ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి జగన్ తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
మరోవైపు, ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద షర్మిల ఒంటరిగా, ఏకాకిలా కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులివెందులలో షర్మిల వెంట ఎపుడూ ఉండే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ శ్రేణులు ఈ సారి లేకపోవడం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయమ్మ కూడా లేకుండా షర్మిల ఒంటరిగా అక్కడకు వెళ్లడంపై చర్చ జరుగుతోంది.
షర్మిల వెంట కేడర్, కార్యకర్తలు, బంధువులు ఎవరూ వెళ్లకూడదని జగన్ హుకుం జారీ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పులివెందులలో షర్మిల ఒంటరి అయ్యారని, జగన్ ఆమెను పట్టించుకోకపోవడంతోనే అన్నతో విభేదాలు వచ్చి ఆమె కొత్త పార్టీ పెడుతున్నారన్న ప్రచారానికి తాజా ఘటన ఊతమిచ్చినట్టయిందని అనుకుంటున్నారు. తనను ధిక్కరించిన షర్మిలను జగన్ ఏకాకిని చేశారని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్ కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.