ఏపీ శాసనసభలో 11 మంది సభ్యులే ఉండటంతో అసెంబ్లీకి ముఖం చాటేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. శాసనమండలిలో తిరుగులేని మెజారిటీ ఉండటంతో టీడీపీకి చుక్కలు చూపించాలని వ్యూహం రచించారు. బిల్లులు పాస్ కాకుండా కూటమి సర్కార్ ను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా తన సైన్యాన్ని మండలికి పంపిస్తున్నారు. కానీ జగన్ వ్యూహం బెడిసి కొట్టింది. నమ్మిన బంటులే ఆయనకు షాకిస్తున్నారు. చివరకు ప్రతిపక్ష నేత హోదాలో వెళ్తున్న బొత్స సత్యనారాయణ కూడా చేతులెత్తేశారు.
మండలిలో మొత్తం 58 సభ్యులుంటే.. అందులో 39 మంది ఎమ్మెల్సీలు వైసీపీకి చెందినవారే ఉన్నారు. టీడీపీ-జనసేన కూటమికి పది మంది ఉండగా.. నలుగురు ఇండిపెండిట్లు, ఇద్దరు పీడీఎఫ్ సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్న శాసనసభ, మండలిల్లో కచ్చితంగా ఆమోదం పొందాలి. మండలిలో గట్టి బలమున్న వైసీపీ.. శాసనసభలో ఆమోదం చెందిన కూటమి బిల్లులను వ్యతిరేకిస్తే ఆయా బిల్లులు ఆగిపోవాల్సిందే.
ఈ నేపథ్యంలోనే మండలిలో తమ వాయిస్ వినిపించాలని జగన్ భావించారు. కానీ జగన్ ప్లాన్ రివర్స్ అయింది. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీని సవాల్ చేయడం లేదు సరి కదా.. దిగజారుడు రాజకీయం చేసి అవసరం అయితే వాకౌంట్లు చేస్తున్నారు. పైగా శాసనసభ టీడీపీ అమోదించిన బిల్లులు మండలిలో కూడా సులువుగా పాస్ అయిపోతున్నాయి. ఇప్పటికే అత్యంత కీలకమైన హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును మండలిలో కూటమి పాస్ చేయించుకుంది.
ఇక ఐఏఎస్ కిషోర్ కుమార్ ను అడ్డం పెట్టుకుని విజయనగరంలో బొత్స ఫ్యామిలీ పలు భూదందాలు చేసినట్లుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా మండలిలో కూటమికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా లోకేష్ తల్లిని తమ పార్టీ నేతలు కించ పరిచింది నిజమేనని మండలిలో బోత్స అంగీకరించడం వైసీపీ వర్గాలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. మిగతా సభ్యులు కూడా మండలికి వచ్చి తమ పని చూసుకుంటున్నారు తప్పితే.. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వెళ్లే రిస్క్ తీసుకోవడం లేదు. హైకమాండ్ ఆ దిశగా ఆదేశాలు ఇచ్చిన సరే లేనిపోని ఇబ్బందులు, కేసులను తలపై పెట్టుకోవడం ఇష్టం లేక వైసీపీ సభ్యులు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో మండలిలో చక్రం తిప్పాలని చూసిన జగన్ కు నిరాశే ఎదురైంది.