ఏపీ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండున్నర ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి మళ్లీ ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు. మరోవైపు విపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వైయస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సాధారణ ఎమ్మెల్యేల తరహాలోనే అసెంబ్లీకి హాజరయ్యారు. తొలి రోజు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి 172 ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రెండో రోజు 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11 గంటలకు శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడుని ఎన్నుకోనున్నారు. అయితే స్పీకర్ ఎన్నికకు జగన్ డుమ్మా కొట్టబోతున్నారు. సభ సంప్రదాయాల ప్రకారం వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దా రెడ్డికి స్పీకర్ ఎన్నిక లో పాల్గొనాలని బాబు ఆదేశాల ప్రకారం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్ననే సూచించారు. జగన్ కు కూడా చెప్పమని కోరారు.
స్పీకర్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సభా సంప్రదాయం. కానీ స్పీకర్ ఎన్నిక పట్ల జగన్ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈరోజు తన సొంత నియోజకవర్గమైన పులివెందుల పర్యటన పెట్టుకున్నారు. మూడు రోజులు పాటు పులివెందులలో జగన్ పర్యటించబోతున్నారు. ఇక తొలి రోజు కూడా జగన్ సభ మర్యాదలను పాటించలేదు. ఎమ్మెల్యేగా తాను మాత్రం ప్రమాణ స్వీకారం చేసి సభ నుంచి వెళ్లిపోయారు. తమ పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యే వరకు కూడా ఉండకపోవడం చర్చనీయాంశం అయింది.
శాసనసభ సంప్రదాయాలు మర్యాదల ప్రకారం సహచర సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయి.. ప్రొటెం స్పీకర్ సభను వాయిదా వేసే వరకు సభ్యులందరూ సభలోనే ఉంటారు. కానీ జగన్ వీటినేమీ పట్టించుకోలేదు. నేడు ఏకంగా స్పీకర్ ఎలక్షన్ కు డుమ్మా కొట్టి సభా సాంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. దీంతో ఆయన తీరును చాలా మంది తప్పు పడుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు, ముఖ్య మంత్రిగా ఐదేళ్లు ఉన్న జగన్ గారికి ఈ కనీసం మర్యాద కూడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు.