ఏపీ ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఈ నెలాఖరున నిమ్మగడ్డ రమేశ్ పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించుకోవటం కోసం.. తాజాగా మూడు పేర్లను ఏపీ సీఎంవో గవర్నర్ కు పంపినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ సీఎంవో కొత్త ఎన్నికల కమిషనర్ నియమకం కోసం మూడు పేర్లను సూచించినట్లు చెబుతున్నారు.
ఈ ముగ్గురు సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులతోపాటు.. నమ్మకస్తులైన అధికారుల పేర్లనే పంపినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఈ సమాచారం బయటకు రానప్పటికీ.. సీఎంతో నుంచి ఒక ఫైల్ గవర్నర్ ఆఫీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ ఫైల్ లో మూడు పేర్లను ఏపీ సీఎంవో సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. అందులో మొదటి పేరు మాజీ ఐఏఎస్ అధికారి.. ప్రస్తుతం సీఎం జగన్ కు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న నీలం సాహ్నిగా చెబుతున్నారు.
రెండో పేరుగా శామ్యూల్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన.. నవరత్నాల అమలు కమిటీకి వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక.. మూడోది ప్రేమచంద్రారెడ్డి పేరు వినిపిస్తోంది. సాధారణ పరిపాలన విభాగంలో ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శి హోదాలో రాష్ట్ర విభజన అంశాల్ని ఆయన చూస్తున్నారు. అయితే.. ఈ మూడు పేర్లను గవర్నర్ కు పంపినట్లుగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఈ ముగ్గురిలో ఒకరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియామకం జరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ ముగ్గురిల ఎవరొచ్చినా.. వారు ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితులే అవుతారని చెప్పక తప్పదు.