ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల పేరుతో బటన్లు నొక్కడం తప్పితే రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. దానికి తోడు వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలతో చెలరేగిపోయారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులను నానా ఇబ్బందులకు గురి చేశారు. నోటి దురుసుతో రెచ్చిపోయారు. ప్రజలను అనేక విధాలుగా ప్రలోభ పెట్టి తీవ్ర వ్యతిరేఖతను మూటగట్టుకున్నారు. కట్ చేస్తే ఐదేళ్లు గిర్రున తిరిగి వచ్చాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఏకపక్షంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓట్ల వర్షం కురిపించారు. వైకాపా ప్రభుత్వాన్ని పాతాలానికి తొక్కేశారు. అయితే వైసీపీ ఓటమికి వ్యతిరేకత కారణం కాదని.. చంద్రబాబు బాబు అబద్దాల వల్లే ఓడిపోయామంటూ తాజాగా మాజీ సీఎం జగన్ కొత్త మాట అందుకున్నారు. చారిత్రాత్మక పరాజయం నుంచి కోలుకున్న జగన్.. తాజాగా ఈవీఎంను ధ్వసం మరియు హత్యాయత్నం కేసుల్లో జైలు పాలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పరామర్మించారు.
ఆపై మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఐదేళ్లలో వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి ప్రతి పథకాన్ని అర్హత మేరకు అందించామన్నారు వైసీపీ ఓటమికి కారణం ప్రజల్లో వ్యతిరేకత కాదన్నారు. చంద్రబాబు మోసపూరిత ప్రచారాల వల్లే ఓటిపోయిందని ఆరోపణలు చేశారు. ఏపీలో చంద్రబాబుకు ఓటు వేయని వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు అన్యాయంగా ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు.
పిన్నెల్లి మీద టీడీపీ ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగానే అక్రమ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. అయితే వాస్తవానికి పిన్నెల్లి అందరు చూస్తుండగానే పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుపడిన టీడీపీ ఏజెంట్ పై దాడికి దిగారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అయినప్పటికీ పిన్నెల్లి ఎటువంటి తప్పు చేయలేదన్నట్లుగా మాజీ సీఎం వాదిస్తుండటం గమన్నార్హం.