అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు పెద్ద పరీక్షే ఎదురు కానుంది. ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున పార్టీ మద్దతు దారులు గెలిచారంటూ.. లెక్కలతో సహా వెల్లడించిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు కార్పొరేషన్లు, మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలనే విషయంపై తీవ్రస్థాయిలో చర్చిస్తున్నారు. దీనికి కారణం.. ఇప్పటి వరకు జరిగిన.. ఎన్నికలు పార్టీ రహితంగా సాగాయి. కానీ, ఇప్పుడు మాత్రం పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతుండడమే!
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా.. రెండు కీలక కార్పొరేషన్లు చేజిక్కించుకునే విషయంలో మాత్రం వైసీపీలో అంతర్మథనం సాగుతుండడం జరుగుతుండడం గమనార్హం. వీటినిలో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు ఉండడం గమనార్హం. ఈ రెండు చోట్లా గెలిస్తే.. వైసీపీకి భారీ ఊపు వస్తుందని.. తాము ఏదైతే కోరుకుంటున్నామో.. దానికి ప్రజల నుంచి అంగీకారం వచ్చినట్టేనని ఆ పార్టీ నాయకులు భావిస్తు న్నారు. రాజధాని అమరావతిని మార్చి.. మూడు రాజధానుల ప్రతిపాదనకు ఈ రెండు జిల్లాల ప్రజలు ముఖ్యంగా మేధావులు, భారీ సంఖ్యలో ఉన్న ప్రజలు అంగీకరించినట్టేనని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
అమరావతి రాజధాని విషయంలో ఇటు విజయవాడ, అటు గుంటూరు ప్రజలకు కీలకంగా మారింది. రాజధాని ఏర్పాటుతో ఇక్కడి ఆస్తుల విలువ పెరగడంతోపాటు.. తమ వ్యాపారాలు కూడా వృద్ధి చెందాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే.. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమంలో విజయవాడ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ, అవకాశం కోసం ఎదురుచూస్తున్నారనేది వాస్తవం. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన కార్పొరేషన్ ఎన్నికల్లో వారు తమ ఉద్దేశాన్ని ఓట్ల రూపంలో వెల్లడిస్తే.. వైసీపీకి గట్టి హెచ్చరికలు వెళ్లినట్టేనని భావిస్తున్నారు. ఇక, గుంటూరు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఈ రెండు కార్పొరేషన్ల విషయం చర్చనీయాంశంగా మారడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.