ఇదేదో.. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శకాదు. రాజకీయ వ్యాఖ్య అంతకన్నా కాదు. రాష్ట్రంలోని ప్రజల నుంచి వైసీపీ సర్కారు వలంటీర్ల ద్వారా సేకరిస్తున్న`అభిప్రాయ` సేకరణ! అని ముమ్మరంగా పుకార్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అవినీతి పరుడా కాదా? ఆయనను అరెస్టు చేయడం తప్పని అనుకుంటున్నారా? చంద్రబాబు అరెస్టు తర్వాత..టీడీపీ బలపడిందని భావిస్తున్నారా? మీ నియోజకవర్గం ఎమ్మెల్యేకి మళ్లీ టికెట్ ఇస్తే మీరు ఓటేస్తారా? టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారా? జనసేన కు మీరు ఓటేస్తారా? అంటూ వైసీపీ నేతల కనుసన్నల్లో ఓ సర్వే జరుగుతోందని తెలుస్తోంది.
ఈ ఇంటింటి సర్వేలో ఆ పార్టీ తరఫున వలంటీర్లు ప్రజలను పై ప్రశ్నలు అడుగుతున్నారట. ప్రస్తుతం చాపకింద నీరులా.. వచ్చే ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ ప్రజల మూడ్ను పసిగడుతోందని, ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని భావిస్తున్న వైసీపీ ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో మూడు మాసాల కిందట నియమించిన గృహ సారథులు, రెండేళ్ల కిందటే నియమించిన వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తోందని భోగట్టా.
ఈ నేపథ్యంలోనే వలంటీర్లు, గృహ సారథులు తమ తమ పరిదిలో ఇంటింటికీ తిరుగుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరినీ కలిసి అభిప్రాయాలు సేకరిస్తున్నారట. వారి మనసులో ఏముందో.. వారు వైసీపీ పాలనపై ఏమనుకుంటున్నారో.. మరోసారి జగన్కు పట్టం కడతారో లేదో తెలుసు కుంటున్నారట. అదే సమయంలో టీడీపీ గురించి, టీడీపీకి సానుభూతి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట.
అయితే.. ఈ సర్వే విషయం చాలా గుంభనంగా ఉంచి పథకాల ముసుగులో వాలంటీర్లతో అనధికారికంగా ప్రీ పోల్ సర్వే మాదిరి చేయిస్తున్నారని తెలుస్తోంది. సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడంతో టీడీపీ నేతలు అలెర్ట్ అయ్యారు. ఇలా వాలంటీర్లతో సర్వే ఏంటని టీడీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. దీనిపై విమర్శలు అయితే చేయగలరు కానీ.. ఎక్కడా అడ్డుకునే ప్రయత్నాలు చేయలేరు. సో.. దీంతో సర్వే కొనసాగుతోంది.