ఏపీలో జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై గతంలో పలువురు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. అనేక వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆ రంగులు తొలగించాలని, కేవలం తెలుపు రంగు మాత్రమే వేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది.
అయితే, ఎక్కడ వీలు చిక్కితే అక్కడ తమ రంగుల కల నెరవేర్చుకోవాలన్న ఆదుర్దాలో జగన్ సర్కార్ దిశ పోలీసు వాహనాలకు నీలం, ఆకుపచ్చ రంగుల్ని వేయడంపైనా విమర్శలు వచ్చాయి. పోలీసు వాహనాలకు వైసీపీ రంగులేయడం ఏమిటని ఆనాడు నారా లోకేష్ మండిపడ్డారు. పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నారని లోకేష్ విమర్శించారు. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైసీపీ రంగులోకి మార్చేసేలా ఉన్నారంటూ గతంలో లోకేష్ సెటైర్లు వేశారు.
ఇక, ఎవరెన్ని విమర్శించినా…భారతీయులకు జాతీయ జెండా మాదిరిగా తమకు వైసీపీ జెండా అని ఫీలవుతున్న వైసీపీ అధినేత జగన్ తాజాగా మరోసారి తన రంగుల కలను సాకారం చేసుకోబోయి భంగపడ్డారు. ఈ క్రమంలోనే ఈ రంగుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి అక్షింతలు వేసింది. చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు తాజాగా ఫైర్ అయింది. గతంలో హైకోర్టు చాలాసార్లు చెప్పినా అవే రంగులు ఎలా వేస్తారంటూ ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.
చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు వైసీపీ కలర్స్ వేయడంపై జై భీమ్ యాక్సిస్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరసా సురేష్ కుమార్, హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటుచేసే భవనాలకు పార్టీ రంగులు వేయడం ఏమిటని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఈ నెల 16న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో తాజాగా వైసీపీకి మరోసారి ‘రంగు’ పడిందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.